నిజమే… ఎవరు ఔనన్నా… ఎవరు కాదన్నా కూడా చంద్రబాబు రాజకీయ పరంపర ఏ ఒక్కరు నిలువరించలేనిదే. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మాటల్లో చెప్పాలంటే… చంద్రబాబు లెగసీ ముమ్మాటికీ అన్ స్టాపబులే. ఎఫ్పుడో 1977లో రాజకీయ తెరంగేట్రం చేసిన చంద్రబాబు… 45 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోనూ ఇంకా సత్తా చాటుతున్నారు. అటు రాజకీయంగానే కాకుండా ఇటు పాలనలోనూ చంద్రబాబు తనదైన మార్కుతో సాగిపోతున్నారు. ఈ ప్రస్థానం ఇప్పుడప్పుడే ఆగేలా కూడా కనిపించడం లేదు.
ఈ మాట నిజమేనన్నట్టుగా ఎప్పటికప్పుడు చంద్రబాబు రాజకీయ చతురతను, చాణక్యాన్ని నేషనల్ మీడియా సరికొత్తగా ఆవిష్కరిస్తూ ఉంటుంది. అలాంటి ఘటనే ఇప్పుడు ఒకటి చోటుచేసుకుంది. ఈ ఘటన టీడీపీ శ్రేణులను ఆకాశంలో తేలేలా చేసిందని కూడా చెప్పవచ్చు. జాతీయ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ‘ద కారవాన్’ మేగజీన్… తన ఫిబ్రవరి సంచికను చంద్రబాబు ముఖ చిత్రంతో విడుదల చేసింది. ఈ మేగజీన్ కవర్ పేజీ చంద్రబాబు ముఖారవిందంతో నిండిపోయింది. ”ద డిస్క్రీట్ ఛార్మ్ ఆప్ చంద్రబాబునాయుడు” పేరిట కవర్ పేజీ కథనాన్ని ఈ మేగజీన్ ప్రచురించింది. కవర్ పేజిపై చంద్రబాబ ఫొటో.. లోపల చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాలను ప్రస్తావిస్తూ ఆ కథనం సాగిపోయింది.
ఈ కథనంలో ఏపీ నూతన రాజధాని అమరావతికి జరిగిన భూమి పూజను కూడా ఈ పత్రిక ఆసక్తికరంగా ప్రస్తావించింది. టీడీపీ గత పాలనలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మోదీ… చంద్రబాబు అడుగు జాడల్లో నడుచుకున్నారని… చంద్రబాబు ఓ ప్రిన్సిపల్ మాదిరి దిశానిర్దేశం చేస్తూ ఉంటే.. ప్రధాని అయి ఉండి కూడా మోదీ ఓ విద్యార్థిలా కదిలారంటూ ఆ కథనం ఆసక్తికర కోణాన్ని ఆవిష్కరించింది. రాజకీయాల్లోకి రావడం, విజయాల బాటలో నడవడం, ఓటమి దక్కినా… తిరిగి లేచి నిలబడటం వంటి విషయాల్లో ఈ తరం నేతలకు చంద్రబాబు ఆదర్శమని కూడా ఆ పత్రిక తన కథనంలో ప్రస్తావించింది. ఇప్పటి కుర్రకారు నేతలతో 75 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు పరుగులు పెడుతున్న తీరును కూడా ఆ పత్రిక ఆసక్తికరంగా విశ్లేషించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates