ఏపీఎన్నార్టీఎస్ అధ్యక్షుడిగా మంత్రి కొండపల్లి

టీడీపీ యువ నేత, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు మరో కీలక బాధ్యత దక్కింది. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్స్ ఆఫ్ తెలుగు సొసైటీ (ఏపీఎన్నార్టీఎస్) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాల్లోని తెలుగు ప్రజల వ్యవహారాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తోంది. గత టీడీపీ హయాంలో ఏర్పాటు అయిన ఈ సంస్థ విదేశాల్లో ఉంటున్న తెలుగు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే కాకుండా ఆయా దేశాల్లోని తెలుగు ప్రజలు.. ప్రత్యేకించి ఏపీ ప్రజలు కలిసిమెలసి ఉండే దిశగా ఉత్తమంగా రాణించిందని చెప్పాలి.

ఇక కొండపల్లి విషయానికి వస్తే… ఉత్తరాంధ్ర జిల్లా అయిన విజయనగరం జిల్లాలోని గజపతినగరం నుంచి మొన్నటి ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వెనుకబడిన విజయనగరం జిల్లాకు చెందిన కొండపల్లి ఉత్తరాంధ్రలోనే తన పూర్తి స్థాయి విద్యాభ్యాసం కొనసాగించారు. కంప్యూటర్స్ సైన్స్ లో ఇంజినీరింగ్ పట్టా సాధించిన శ్రీనివాస్…ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. విద్యాభ్యాసం తర్వాత అక్కడే ప్రపంచ ప్రసిద్ధ సాఫ్ట్ వేర్ సంస్థ ఒరాకిల్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కొలువు సాదించారు. ఆపై వెనక్కు తిరిగి చూసుకోని శ్రీనివాస్.. ఒరాకిల్ తో ఏళ్ల తరబడి అనుబంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో అమెరికా, అరబ్ దేశాల్లో కూడా ఆయన పనిచేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తగానూ రాణించిన తర్వాత మాతృభూమికి వచ్చారు. వచ్చీ రాగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే మంత్రి పదవిని దక్కించుకున్నారు.

విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం, విదేశాల్లోనే ఉద్యోగం… ఔత్సాహిక పారిశ్రామికవేత్తగానూ అక్కడే సక్సెస్… వెరసి ఎన్నార్టీ వ్యవహారాల్లో కొండపల్లికి మంచి పట్టు ఉందని చెప్పక తప్పదు. అంతేకాకుండా ఏ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి?.. ఎక్కడ మనవాళ్లు రాణిస్తున్నారు?.. ఏఏ దేశాల్లో మనకు అవకాశాలు ఉన్నాయి?.. ఎలాంటి చర్యలు తీసుకుంటే విదేశాల్లో మనవాళ్లు రాణిస్తారు?.. అన్నవిషయాలపై కొండపల్లికి సంపూర్ణ అవగాహన ఉంది. అంతేకాకుండా సాష్ట్ వేర్ ఇంజినీర్ గా ఆయన ప్రస్థానం కూడా కొండపల్లికి ప్లస్సేనని చెప్పాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ లు ఏపీఎన్నార్టీఎస్ అధ్యక్షుడిగా కొండపల్లికి కీలక బాధ్యతలు అప్పగించారు.