ఉచితాలు, రాయితీలతో ఆర్టీసీకి మూత తప్పదట

ఇప్పుడు ఎన్నికలు జరిగిన, జరుగుతున్న, జరగబోయే ఏ రాష్ట్రంలో చూసినా… మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఆయా రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు మహారాష్ట్ర, తెలంగాణల్లో ఈ పథకాన్ని పట్టాలెక్కించాయి. ఏపీలో త్వరలోనే ఈ పథకం అమలులోకి రానుంది. ఇకపై ఎన్నికలు జరిగే ప్రతి దాదాపుగా ప్రతి రాష్ట్రంలోనూ ఇదే తరహా హామీలు వినిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ హామీలు ఇచ్చే పార్టీలు అదికారంలోకి వస్తే…మహిళలకు ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం దక్కుతుంది.

అయితే ఇప్పటికే ఆర్టీసీల్లో ఆయా వర్గాలకు ఇస్తున్న రాయితీలతో ఆ సంస్థలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని మహారాష్ట్రకు చెందిన రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ, శివసేనలతో కూడిన మహాయుతి సర్కారు అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఈ కూటమి మహిళలకు ఆర్టీసీలో రాయితీతో కూడిన ప్రయాణం హామీ ఇచ్చింది. అనుకున్నట్లుగానే మహాయుతి అధికారంలోకి రావడంతో సర్కారీ బస్సుల్లో మహిళలకు 50 శాతం రాయితీతో కూడిన ఉచిత ప్రయాణం అందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ హామీని అమలు చేస్తున్న మంత్రే ఈ పథకాన్ని కొనసాగిస్తే సంస్థను మూసుకోవడం తప్పించి మార్గాంతరం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.

అయినా ప్రతాప్ సర్నాయక్ ఏమంటారంటే… రాయితీలు ఇచ్చుకుంటూ పోతే ఆర్టీసీని నడపడం కష్టం అవుతుందని ఆయన అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, 75 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇస్తున్న రాయితీలతో సంస్థకు రోజుకు రూ.3 కోట్ల మేర నష్టం వస్తోందని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ కొత్తగా రాయితీలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్టీసీల్లో మహిళలకు 50 శాతం రాయితీ, 75 ఏళ్లు పైబడిన వారికి రాయితీ ఇస్తున్నామన్నారు. ఈ పథకాలతోనే ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లుతోందని చెప్పిన ఆయన… అన్నింటా రాయితీలు ఇచ్చుకుంటూ పోతే ఆర్టీసీ మూతపడిపోవడం తథ్యమని ఆందోళన వ్యక్తం చేశారు.