జ‌గ‌న్ మార‌లేదు: ఈ స్క్రిప్టులు ఇంకెన్నాళ్లు.. ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో మార్పు రావ‌డం లేద‌ని.. సొంత పార్టీ నాయ‌కులే చెబుతున్నారు. పార్టీ ఘోర పరాజ‌యం త‌ర్వాత‌.. ఆయ‌న మారుతార‌ని, మార్పు వ‌స్తుంద‌ని అనుకున్నారు. నాయ‌కుల‌ను కార్య‌క‌ర్తల‌ను క‌లుపుకొని పోతార‌ని ఆశించారు. అయితే.. ఈ విష‌యంపై జ‌గ‌న్ సానుకూలంగానే స్పందించారు. జ‌గ‌న్ 2.0లో మార్పులు ఖ‌చ్చితంగా చూస్తార‌ని చెప్పారు. ఇదిలావుంటే.. అస‌లు రావాల్సిన మార్పు.. జ‌నం మ‌న‌సులు ఆక‌ట్టుకోవ‌డం. ఈ విష‌యంలో జ‌గ‌న్‌లో మార్పు రావ‌డం లేదు.

గ‌తంలో వైసీపీ అధినేత‌గా జ‌గ‌న్‌.. ఓదార్పు యాత్ర‌లు చేసినా.. పాద‌యాత్ర‌లు చేసినా.. ప్ర‌జ‌ల‌తో నేరుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాట్లాడారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ఎక్క‌డా చిన్న పేప‌ర్ ముక్క కూడా ప‌ట్టుకోకుండానే.. త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కానీ. అదేంటో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. గ‌త ఐదేళ్లు రాసిచ్చిన స్క్రిప్టులనే చ‌దివారు. ఇది భారీ మైన‌స్ అయిపోయింది. రాసిచ్చిన వాటిలోనూ అనేక త‌ప్పులు చ‌ద‌వ‌డం.. ట్రోల్స్‌కు కూడా దారితీసింది.

క‌ట్ చేస్తే.. పార్టీ అధికారం కోల్పోయి.. 9 మాసాలు అయింది. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ ప‌రిస్థితుల‌పై అవ‌గాహన పెంచుకోలేక పోయార‌న్న చ‌ర్చ సాగుతోంది. నేరుగా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌లేక‌పోతున్నార‌న్న చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. చిన్న విష‌యాన్ని కూడా రాసి ఇవ్వాల్సి రావ‌డం.. దానిని ఆయ‌న మీడియా ముందు ఒక‌టికి రెండు సార్లు చూసి చ‌ద‌వాల్సి రావ‌డం వంటివి .. చూప‌రుల‌కు , పార్టీ నాయ‌కుల‌కు కూడా ఇబ్బం దిగానే మారింది.

వంశీని విజ‌య‌వాడ జైల్లో ప‌రామ‌ర్శించిన అనంత‌రం.. మీడియాతో మాట్లాడినా.. జ‌గ‌న్ చేతిలో స్క్రిప్టు ప‌ట్టుకుని మాట్లాడారు. అయినా.. అనేక సంద‌ర్భాల్లో ఆయ‌న త‌డ‌బ‌డ్డారు. ఇక‌, గుంటూరులోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపించింది. నిజానికి ఓడిపోయిన త‌ర్వాత అయినా.. ప‌రిస్థితుల‌ను అర్ధం చేసుకుని ధారాళంగా వ్యాఖ్య‌లు చేసేందుకు స‌బ్జెక్టు వినిపించేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ… జ‌గ‌న్ మాత్రం త‌న పాత ధోర‌ణిని మాత్రం వీడ‌లేదు. దీనిపై సోష‌ల్ మీడియాలో అనేక కామెంట్లు కురుస్తున్నాయి. మ‌రి జ‌గ‌న్ ఇప్ప‌టికైనా స్క్రిప్టులేకుండా మాట్లాడే ప్ర‌య‌త్నం చేస్తారేమో చూడాలి.