జగన్ పై కేసు ఓకే… లేని పేర్నినీ ఇరికించారట

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గుంటూరు పరిధిలోని నల్లపాడు పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ కేసులో జగన్ తో పాటు మరో 8 మంది వైసీపీ నేతల పేర్లను కూడా పోలీసులు చేర్చారు. అంటే… జగన్ తో కలిసి మొత్తంగా 9 మందిపై కేసు నమోదు అయిపోయిందన్న మాట. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అయినా కూడా బుధవారం జగన్ గుంటూరులోని మిర్చి యార్డుకు వెళ్లి అక్కడి రైతులతో మాట్లాడారు. జగన్ పర్యటన ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్టేనని నిర్ధారించిన పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

ఇక్కడిదాకా బాగానే ఉన్నా… పోలీసులు ఓ పొరపాటు చేశారట. బుధవారం జగన్ తో కలిసి వైసీపీకి చెందిన చాలా మంది కీలక నేతలు మిర్చి యార్డుకు వెళ్లారు. వీరిలో ప్రధానమైన నేతల పేర్లను ఎంచుకుని పోలీసులు వారి పేర్లను కేసులో పొందుపరిచారు. ఈ పేర్లలో అంబటి రాంబాబు, కొడాలి నాని, మేరుగు నాగార్జున, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తులసి రఘురాం, నందిగం సురేశ లతో పాటుగా పేర్ని నాని పేరును కూడా పోలీసులు కేసులో చేర్చారు. అయితే పేర్ని నాని బుధవారం నాటి జగన్ కార్యక్రమానికే హాజరు కాలేదట. ఈ విషయాన్ని అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా గురువారం వెల్లడించారు.

ఈ సందర్భంగా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని షేర్ చేసిన అంబటి… ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిర్చి యార్డు పర్యట సందర్భంగా వైఎస్ జగన్ మరో 8 మందిపై కేసు నమోదు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించలేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ పర్యటన వైపు కన్నెత్తి చూడని పేర్ని నానిని కూడా ముద్దాయిగా చేర్చడం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు. అంబటి బయటపెట్టిన ఈ విషయాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకుని పేర్ని నానిని ఈ కేసు నుంచి తొలగిస్తారో, లేదో చూడాలి.