టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ బుధవారం ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఇకపై తాను నియోజకవర్గాల పర్యటనకు వస్తే… ముందుగా ఆయా నియోజకవర్గాల కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాతే మిగిలిన కార్యక్రమాలు ఉంటాయన్న లోకేశ్… ఆ తర్వాతి కార్యక్రమాలు ఎంత ప్రాధాన్యత కలిగినవైనా కూడా ముందుగా మాత్రం కేడర్ తోనే భేటీ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం తిరుపతి పర్యటనకు వచ్చిన సందర్భంగా లోకేశ్ తొలుత పార్టీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే లోకేశ్ ఈ విషయాన్ని ప్రకటించారు.
పార్టీ కార్యకర్తే పార్టీకి అధినేత అంటూ ఇటీవల లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ సభ్యత్వం కోటి మార్కును దాటిన సందర్భంగా లోకేశ్ చేసిన ఈ కామెంట్ పార్టీ కేడర్ ను బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. అంతేకాకుండా కేవలం మాటలు చెప్పడం వరకే కాకుండా తాను ఎక్కడికి వెళ్లినా పార్టీ కేడర్ కు ఆయన కొంత సమయాన్ని కేటాయిస్తున్న తీరుతోనూ పార్టీ కేడర్ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇదే తీరును కొనసాగిస్తానన్న లోకేశ్ ప్రకటనతో తిరుపతి కేడర్ సమావేశం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేసిన లోకేశ్… గతంలో యువగళం పాదయాత్ర సందర్భంగా చాలా మంది కార్యకర్తలు… తాము పార్టీ కోసం అవిశ్రాంతంగా కష్టపడుతున్నా తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన తీరును గుర్తు చేసుకున్నారు.
ఈ క్రమంలో ఇకపై పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలు, నేతలను గుర్తించి వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని లోకేశ్ చెప్పారు. అంతేకాకుండా తిరుపతి కేడర్ మీటింగ్ తోనే ఈ కార్యక్రమానికి కూాడా లోకేశ్ శ్రీకారం చుట్టారు. పార్టీ కోసం కష్టపడ్డ కేడర్ కు లోకేశ్ ప్రోత్సాహక బహుమతులను అందించారు. పార్టీ కేడర్ ను గౌరవించాలని, వారికి మంచి ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. కేడర్ లేకుంటే పార్టీనే ఉండదన్న విషయాన్ని నేతలు గుర్తుంచుకోవాలన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం కూడా పార్టీ కేడర్ కృషి వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు. పార్టీ ప్రస్తుతం అటు కేడర్ పరంగా అయినా… ఇటు గెలుపు విషయంలో అయినా బలీయంగా ఉందన్ లోకేశ్.. ఇదే దూకుడును కొనసాగించాలన్నారు. ఏదో ఎన్నికల్లో గెలిచాం… ఎంజాయ్ చేద్దామంటే కుదరదని అటు నేతలతో పాటు ఇటు కేడర్ కు కూడా లోకేశ్ గుర్తు చేశారు.