తన సోదరుడు జగన్ పార్టీ వైసీపీపై తరచుగా విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్. షర్మిల తాజాగా డోస్ పెంచారు. వైసీపీ నాయకులు గత ఐదేళ్లు పాలనను పక్కన పెట్టి ప్రజాధనాన్ని, వారి ఆస్తులను కూడా పందికొక్కుల్లా దోచుకుతిన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో ప్రజలకు రక్షణ కూడా లేకుండా పోయిందన్నారు. అందుకే ప్రజలు ఛీ కొట్టి 11 స్థానాలకే పరిమితం చేశారని షర్మిల నిప్పులు చెరిగారు.
ప్రజలు తమను ఉద్ధరిస్తారని అధికారం ఇస్తే.. తాడేపల్లి ప్యాలస్‌కే పరిమితం అయిందెవరో ప్రజలకు తెలుసునని చెప్పారు. తాము ప్రజలకు చేరువ కావడం లేదని.. కేవలం సోషల్ మీడియాలో ఏదో వ్యాఖ్యలు చేస్తే.. స్పందించేది లేదన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తాము ప్రజల కోసం ప్రతినెలా పోరాటాలు చేస్తున్నామని.. ప్రతి జిల్లాలోనూ తమ పార్టీ నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
“రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నారు. ఐదేళ్లు కుంభకర్ణుడి లెక్క నిద్ర పోయారు. అధికారం అనుభవిస్తూ ఖాళీగా కూర్చున్నారు“ అని వైసీపీ నాయకులపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు మిర్చి యార్డు రైతుల కష్టాలను తామే వెలుగులోకి తెచ్చామన్న ఆమె.. ఇప్పుడు తీరిగ్గా వైసీపీ స్పందించిం దని.. అది కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. ప్రజలను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తూ..ఏదో నమ్మించాలని చూస్తోందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం లేదన్న బొత్స వ్యాఖ్యలపైనా ఆమె స్పందించారు. అసలు పాలసీ లేనిది.. బీజేపీతో తెరచాటు కాపురం చేసింది.. వైసీపీనేనని దుయ్యబట్టారు. బీజేపీకి దత్తపుత్రుడు ఎవరు? అని అడిగితే.. ప్రతి ఒక్కరూ చెప్పేది ఎవరి పేరో బొత్స తెలుసుకోవాలన్నారు. “151 సీట్ల నుంచి వైసీపీని 11 సీట్లకు ప్రజలు పరిమితం చేశారు. అయినా మీ వైఖరీలో మార్పు రావడం లేదు“ అని దుయ్యబట్టారు. మొత్తానికి షర్మిల తన దాడిలో డోస్ పెంచడం గమనార్హం.