ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన ఒకే ఒక్కమాట మంత్రంగా పనిచేసింది. అప్పటి వరకు గుంటూరు మిర్చి యార్డులో ఆందోళన, నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు.. చంద్రబాబు చెప్పిన మాటతో నిరసన విరమించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మిర్చి రైతులు.. తమకు గిట్టుబాటు ధర లభించడం లేదని.. కనీసం ఖర్చులు కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 ఉమ్మడి జిల్లాల్లో పండిన మిర్చిని తీసుకుని గుంటూరు మిర్చి యార్డుకు వచ్చిన రైతన్నలు వారాల తరబడి అక్కడే ఉన్నారు.
ప్రస్తుతం మద్దతు ధర రూ.7.5 వేలు ఉంది. కానీ, ఈ ధరకు అమ్మితే.. తమకు ఖర్చులు కూడా రావని వారు వాపోతున్నారు. ఇక, మార్కెట్ ధర రూ.13,500గా ఉంది. ఇది కూడా తమకు గిట్టుబాటు ధర రావడం లేదని చెబుతున్నారు. గతంల 2022-23 మధ్య ఉన్న 22000-23000 ధర ఇప్పించాలని వారు కోరుతున్నారు. కానీ, ప్రభుత్వం ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. ఇదే నిరసనకు, ధర్నాలకు దారి తీశాయి. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ అక్కడ పర్యటించి రైతును పరామర్శించారు.
ఆ వెంటనే ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. మిర్చి ధరల పతనంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో చర్చించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉందని మంత్రి చెప్పినప్పటికీ.. ఏపీని ప్రత్యేకంగా పరిగణించాలని.. నాణ్యమైన మిర్చి ఏపీలోనే పండుతోందని చంద్రబాబు గణాంకాలతో సహా వివరించారు. గతంలో ఇచ్చిన ధరలకే ఇప్పుడు ఇప్పించాలని సూచించారు. మార్కెట్ ఇంటర్ వెన్షన్ ధరలు కాకుండా.. సాగుకు అయ్యే నిజ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించాలని కోరారు.
దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఆ వెంటనే చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. మిర్చిరైతులకు న్యాయం చేస్తామని, ఇప్పుడే కేంద్ర మంత్రితోనూ చర్చించామని చెప్పారు. త్వరలోనే న్యాయం జరుగుతుందన్నారు. మిర్చిని కేంద్రం కొనుగోలు చేసేలా ఒప్పిస్తామన్నారు. దీనిపై రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ విషయం తెలియగానే.. రైతులు తమ ఆందోళనను విరమించారు. మరోవైపు రాష్ట్ర అధికారులు కూడా రైతులతో చర్చించారు. చంద్రబాబు సూచనలను వారికి చేరవేశారు. దీంతో ప్రస్తుతానికి ఆందోళన విరమిస్తున్నట్టు రైతు సంఘాలు ప్రకటించాయి.