కాదేదీ వ్యాపారానికి అనర్హం.. అన్నట్టుగా వికృత వ్యాపారాలు చేసేవారు.. పవిత్ర మహాకుంభమేళాను కూడా అపవిత్రం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా తరలి వస్తున్న భక్తులు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని మరీ.. కుంభ్ స్నానాలు చేస్తున్నారు. అయితే.. ఇవన్నీ ఓపెన్ ప్లేస్‌లు కావడంతోపాటు.. యూట్యూబర్లు.. ఇతర సామాజిక మాధ్యమాలకు చెందిన వారు కూడా.. ఇక్కడ సంచరిస్తున్నారు.
ఈ క్రమంలో కుంభమేళాలో పుణ్య స్నానాలు చేస్తున్న మహిళల వీడియోలను అత్యంత చాకచక్యంగా చిత్రీకరిస్తున్నారు. వాస్తవానికి.. ఎవరో తమను వీడియోలు తీస్తున్నారని.. ఫొటోలలో తమను బంధిస్తున్నారని.. ఆ మహిళలకు తెలియదు. భక్తిగా వారు.. త్రివేణీ సంగమ జలాలలో మునకలు వేస్తూ.. పుణ్య కోసం పాకులాడుతున్నారు. కానీ, కాస్త అందమైన మహిళలు అయితే.. చాలు.. కొందరు యూట్యూబర్లు.. అక్కడే తిష్ఠవేసి.. ఏదో ప్రకృతిని చిత్రీకరిస్తున్న నటించి.. స్నానం చేసే మహిళల వీడియోలను తీస్తున్నారు.
అంతేకాదు.. వీటిని సోషల్ మీడియా సహా పోర్న్ సైట్లలోనూ పెడుతున్నారు. మరికొందరు అయితే.. వీటిని విక్రయిస్తున్నారట. ఈ వ్యవహారాన్ని పసిగట్టిన యూపీ పోలీసులు.. తక్షణమే అలెర్ట్ అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పుణ్య స్నానాలకు వచ్చే మహిళల వీడియోలను నిశితంగా గమనించి.. అవి ఎక్కడ అప్‌లోడ్ అవుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? అనే విషయాలపై కూపీ లాగుతున్నారు. వీరిపై సైబర్ చట్టంతోపాటు.. అవసరమైతే పోక్సో చట్టాన్ని కూడా ప్రయోగించనున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇక, ఈ వికృత కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునేందుకు ఏఐ దిగ్గజ సంస్థ మెటా సాయాన్ని కూడా పోలీసులు తీసుకుంటున్నారు. మహిళలు స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు తీస్తున్నవారి సైట్లు, వారి ఐడీలను తమకు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ వివారాలు రాబట్టాక.. కఠిన చర్యలు తప్పవని.. యూపీ డీజీపీ యాదవ్ వెల్లడించారు.