ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం విపత్తుల సహాయ నిధులు విడుదల చేసింది. ఏపీ, తెలం గాణ సహా మొత్తం ఐదు రాష్ట్రాల(త్రిపుర, ఒడిశా, నాగాలాండ్)కు ఈ నిధులను విడుదల చేసింది. ఏపీకి 606 కోట్ల రూపాయలను విడు దల చేసిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం 231 కోట్ల రూపాయలను మాత్రమే ఇచ్చింది. ఈ నిధులను విపత్తుల నిర్వహణ, ప్రజల పునరావాసానికి మాత్రమేకేటాయించాలని తేల్చి చెప్పింది. అంతేకాదు.. ఈ నిధులను ఇతర సంక్షేమ పథకాలకు మళ్లిస్తే.. వడ్డీతో సహా వసూలు చేయనుంది.
ఏపీకి రూ.606 కోట్లు కేటాయించడం వెనుక.. రెండు కారణాలు ఉన్నాయి. ఏపీలో తీరప్రాంత జిల్లాలు విశాఖ, ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ఉన్నాయి. ఇవన్నీ కూడా విపత్తు ప్రభావిత జిల్లాలుగా గుర్తింపు పొందాయి. ఈ నేపథ్యంలో తుఫాన్లు, ఇతర వరదలు వంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీంతో నిధుల కేటాయింపులో ఎక్కువ మొత్తం ఏపీ కేటాయించారు. అయితే.. ఈ నిధులను కేవలం కేటాయించిన కార్యక్రమానికే వినియోగించాలని తేల్చి చెప్పింది.
మాపై విపక్ష: తెలంగాణ
కాగా.. తెలంగాణ సర్కారు ఈ విపత్తు నిధులపై విమర్శలు గుప్పించింది. తమపై కేంద్రం వివక్ష ప్రదర్శి స్తోందని మంత్రి మల్లు భట్టు విక్రమార్క వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రానికి తీర ప్రాంతం లేకపోయినా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వరదల కారణంగా.. అనేక జిల్లాలు ముంపులో చిక్కుకుంటున్నాయని.. భద్రాద్రి జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు, ఖమ్మం జిల్లాలో ప్రజలకు గతంలో ఇస్తామన్న విపత్తు నిధులను ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. కేంద్రం ఇస్తున్న నిధులు రాష్ట్రాలు కడుతున్న పన్నుల నుంచే ఇస్తున్నారని.. దీనికి లెక్కలు చూపాలని కోరడం సమంజసం కాదని మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. విపత్తు నిధులు అంటే.. కేవలం వరదలు, వర్షాలు వచ్చినప్పుడే కాదు.. అవి రాకుండా చేపట్టేందుకు చేసే కార్యక్రమాలకు కూడా వినియోగించుకుంటామని.. ఆయన తెలిపారు. కానీ, ఆంక్షలు పెట్టడం సరికాదని ఆయన అన్నారు.