కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు నుంచి విడుదలయ్యే నిధులు ఏవైనా కూడా… వాటిలో ఏపీకి అగ్ర తాంబూలం లభిస్తోంది. మొన్నటికి మొన్న కేంద్ర సాధారణ బడ్జెట్ లో అయినా… ఆ తర్వాత వచ్చిన రైల్వే బడ్జెట్ లో అయినా ఏపీకి భారీ కేటాయింపులు దక్కాయి. ఈ కేటాయింపుల్లో ఏ ఇతర రాష్ట్రంతో పోల్చినా కూడా.. ఏపీకే భారీ కేటాయింపులు లభించాయి. ఏపీకి దక్కుతున్న ప్రత్యేక కేటాయింపులను పక్కనపెట్టినా కూడా ఆయా శాఖల వారీగా కేంద్రం విడుదల చేస్తున్న నిధుల్లో ఏపీకే సింహ భాగం దక్కుతున్నాయి. తాజాగా కేంద్రం విడుదల చేసిన విపత్తుల నిధుల్లోనూ అదే జరిగింది.
గతేడాది దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు చోటుచేసుకోగా… ఆయా రాష్ట్రాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసిన కేంద్రం తాజాగా బుధవారం ప్రకృతి విపత్తు నిధులను విడుదల చేసింది. మొత్తం 5 రాష్ట్రాలకు కలిపి కేంద్రం రూ.1554.99 కోట్లను కేటాయించింది. త్వరలోనే ఈ నిధులు విడుదల కానున్నాయి. ఈ నిధుల్లో ఏపీకి అత్యధికంగా రూ.608.8 కోట్లు దక్కనున్నాయి. అదే సమయంలో తెలంగాణకు రూ.231.75 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, నాగాలాండ్ కు రూ.170.99 కోట్లు వంతున కేటాయింపులు జరిగాయి.
నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫండ్ కింద కేటాయించిన ఈ నిధులు త్వరలోనే ఆయా రాష్ట్రాలకు అందనున్నాయి. వాస్తవానికి ఏపీలో గతేడాది ప్రకృతి విపత్తుల కారణంగా భారీ ఎత్తున నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం నష్టాన్ని అంచనా వేసిన కేంద్రం… జరిగిన నష్టానికి సరిపడే రీతిలోనే విపత్తు నిధుల కింద రాష్ట్రానికి రూ.608.8 కోట్లను కేటాయించింది. కేంద్రంతో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయడు నెరపుతున్న సత్సంబంధాల కారణంగానే…. అంశం ఏదైనా కూడా ఏపీకి నిధుల కేటాయింపులో అగ్ర తాంబూలం లభిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.