ఏపీలో గడచిన ఐదేళ్ల కాలంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులు దక్కాయి. ఇతర సామాజిక వర్గాల వారికి నిరాదరణ కరువైంది. ప్రతిభను పట్టించుకున్న నాథుడే రాష్ట్రంలో కరువయ్యాడు. ఇదేమని ప్రశ్నిస్తే.. కేసులు, అరెస్టులు స్వాగతం పలికేవి. ఈ తరహా పాలనకు విద్యకు ఆలయాలుగా ఉన్న విశ్వవిద్యాలయాలు కూడా బలి అయిపోయాయి. రాష్ట్రంలోని చాలా యూనివర్సిటీలకు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే వైస్ ఛాన్సలర్లుగా నియమితులయ్యారు. ఫలితంగా విద్యాభివృద్ధిని గాలికి వదిలేసిన వీసీలు… ప్రభుత్వ పెద్దల భజనలో తరించారు. విద్యార్థుల బాబోగులు అస్సలే పట్టించుకోలేదు. ఇది వైసీపీ హయాంలో జరిగిన తంతు.
వైసీపీ హయాంలో ఏపీలో ప్రధాన వర్సిటీలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే వీసీలుగా నియమితులయ్యారు. ఇందులో ఆయా ప్రొఫెసర్ల అర్హతలను కూడా పక్కనపెట్టారన్న వాదనలూ వినిపించాయి. ఈ తరహా నియామకాల వివరాల్లోకి వెళితే… రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా హేమచంద్రారెడ్డి నియమితులయ్యారు. ఇక రాష్ట్రంలోని అతి పెద్ద వర్సిటీగా పేరున్న ఆంధ్రా వర్సిటీకి పీవీజీడీ ప్రసాద్ రెడ్డి వీసీగా నియమితులయ్యారు. యోగి వేమనకు రామచంద్రారెడ్డి, శ్రీవేంకటేశ్వర వర్సిటీకి శ్రీకాంత్ రెడ్డి, పొట్టి శ్రీరాములు వర్సిటీకి నరసింహారెడ్డి… ఇలా దాదాపు అన్ని వర్సిటీల బాధ్యతలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి చేతుల్లోకే వెళ్లిపోయాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించినా… జగన్ సర్కారు పట్టించుకున్న పాపానే పోలేదు.
అయితే కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత ఈ కులం కంపును వర్సిటీల నుంచి పారదోలేందుకు టీడీపీ అధినేత… ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నడుం బిగించారు. వర్సిటీల వీసీల బాధ్యతలను కులం ప్రాతిపదికగా ఇచ్చేందుకు చంద్రబాబు ససేమిరా అన్నారు. అంతేకాకుంగా గత సర్కారులో జరిగిన పొరపాట్లను సరిదిద్దేలా మేథోమథనమే చేశారు. ఇందుకోసం చాలా సమయమే పట్టిానా… ఆయా వర్సిటీలకు దేశంలోని అత్యున్నత స్థాయి కలిగిన విశ్వవిద్యాలయాల్లో కీలక స్థానాల్లో ఉన్న వారిని ఏరికోరి మరీ రాష్ట్రంలోని వర్సిటీలకు వీసీలుగా ఎంపిక చేశారు. ఈ మేరకు మంగళవారం చంద్రబాబు సర్కారు ఆయా వర్సిటీలకు వీసీలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ జాబితాను చూస్తే… వీసీల ఎంపికకు చంద్రబాబు ఏ మేర కసరత్తు చేశారో ఇట్టే అర్థం కాక మానదు.
విశాఖలోని ఆంధ్రా వర్సిటీ వీసీగా జీపీ రాజశేఖర్ నియమితులయ్యారు. ఈయన ఐఐటీ ఖరగ్ పూర్ కు చెందిన ప్రొఫెసర్. ఇక వరంగల్ నిట్ లో ఆచార్యుడిగా పనిచేస్తున్న సీఎస్ఆర్కే ప్రసాద్ ను జేఎన్టీయూ కాకినాడ వీసీగా నియమితులయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో పనిచేస్తున్న ప్రకాశ్ బాబు యోగి వేమన వర్సిటీ వీసీగా నియమితులు అయ్యారు. విక్రమ్ సింహపురి వర్సిటీ వీసీగా ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన అల్లం శ్రీనివాసరావు ఎంపికయ్యారు. హైదరాబాద్ లోని ఉస్మానియా వర్సిటీకి చెందిన వెంకట బసవ రావును రాయలసీమ వర్సిటీ వీసీగా నియమించారు. కృష్ణా వర్సిటీకి ఆంధ్రా వర్సిటీకి చెందిన రాంజీ, ఆదికవి నన్నయ్య వర్సిటీ వీసీగా ఆంధ్రా వర్సిటీకే చెందిన ప్రసన్నశ్రీలు వీసీలుగా నియమితులయ్యారు. ఈ నియామకాలు చూస్తుంటే… దేశంలోనే అత్యున్నత స్థాయి వర్సిటీల్లో కీలక స్థానాల్లో పనిచేసే వారిని ఎంపిక చేసిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.