మోడీ నెత్తిన ట్రంప్‌… కుంప‌టి??

గ‌త ఏడాది అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యం అది. ఆ స‌మ‌యంలో భార‌త విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంక‌ర్‌.. అంత‌ర్జాతీయ మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. ఇవి వ‌రుస‌గా సాగాయి. ఆ ఇంట‌ర్వ్యూల్లో ప్ర‌ధానంగా అమెరికా ఎన్నిక‌ల‌పైనే ఫోక‌స్ చేశారు. “ట్రంప్ లాంటి బ‌ల‌మైన వ్య‌క్తి అధ్య‌క్షుడు అయితే.. మేలు జ‌రుగుతుంది.. అని మేం భావిస్తున్నాం.“ అని ఓ సంద‌ర్భంగా చెప్పారు. “ట్రంప్‌కే అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్టే స‌త్తా.. అమెరికాను న‌డిపించే సత్తా ఉన్నాయ‌ని న‌మ్ముతున్నాం“ అని మ‌రో ఇంట‌ర్వ్యూలో నొక్కి వ‌క్కాణించారు.

ఈ సంద‌ర్భాల‌ను ఎందుకు గుర్తుచేయాల్సి వ‌స్తోందంటే.. దేశ ప్ర‌ధాని మోడీ.. అమెరికా అధ్య‌క్ష ఎన్నికల‌పై తాను చెప్పాల్సిన మాట‌ల‌ను జైశంక‌ర్ రూపంలో చెప్పించారు. పైగా మోడీ కూడా ట్రంప్ గెల‌వాల‌నే కోరుకున్నారు. చివ‌ర‌కు ట్రంప్ విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, మోడీ ఆశ‌లు చిగురించాయా? అంటే.. లేద‌నే చెప్పాలి. పైగా మోడీ నెత్తిన ట్రంప్‌.. పెద్ద కుంప‌టే పెట్టారు. ఇంకా పెడుతున్నారు కూడా! భార‌త్ ద‌గ్గ‌ర బోలెడు డ‌బ్బులు ఉన్నాయ‌ని.. కాబ‌ట్టి తాము ఇస్తున్న 21 మిలియ‌న్ డాల‌ర్ల ఓట‌ర్ల నిధిని నిలిపివేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు.

ఇదేమీ తేలిక విష‌యం కాదు. ప్ర‌తి ఐదేళ్ల‌కు భార‌త ప్ర‌భుత్వం ఖ‌ర్చు పెడుతున్న ఎన్నిక‌ల నిధుల్లో ఇది 50 శాతానికి పైగా వాటా క‌లిగి ఉంది. అలాంటి నిధులు నిలిపివేస్తూ.. అమెరికా నిర్ణ‌యం తీసుకుంది. అంతేకాదు.. ఈ ఏడాది ఇచ్చిన వాటిని(బైడెన్ హ‌యాంలో) కూడా వెన‌క్కి తీసుకునే అవ‌కాశంపై దృష్టి పెట్టింది. దీనిపై మోడీ స‌ర్కారు మౌనంగా ఉంది. కానీ, అమెరికా ఇస్తున్న నిధులు లేక‌పోతే.. రేపు.. వ‌న్ నేష‌న్‌-వ‌న్ ఎల‌క్ష‌న్ వంటివి సాకారం కావ‌డం అంత ఈజీ అయితే కాదు. అస‌లు ఈ విధానంలోనూ మార్పు రావొచ్చు.

మ‌రో కీల‌క విష‌యం.. అక్ర‌మ వ‌ల‌స దారుల‌ను కాళ్లు, చేతులు క‌ట్టేసి వెన‌క్కి పంపించ‌డం. తొలుత దీనిని ఖండించిన మోడీ స‌ర్కారు.. దీనిని హైలెట్ చేస్తూ.. కార్టూన్ ప్ర‌చురించిన‌ త‌మిళ‌నాడులోని `విక‌ట‌న్‌`వెబ్ సైట్‌పై నిషేధం విధించి.. మ‌రింత‌గా చేతులు కాల్చుకుంది. పోనీ.. అమెరికా ఏమ‌న్నా..త‌న తీరు మార్చుకుందా? అంటే అది కూడా లేదు. పైగా.. మేమింతే అని తాజాగా ట్రంప్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఇక నుంచి అక్ర‌మ వ‌ల‌స దారుల దేశాల‌పై రెట్టింపు సుంకాలు విధించేలా చ‌ర్య‌లు తీసుకునే ప్ర‌తిపాద‌న ఉంద‌న్నారు. మొత్తానికి ఈ రెండుఅంశాలు.. ట్రంప్ హ‌యాంలో మోడీ నెత్తిన పిడుగులు ప‌డేలా చేసింద‌న్న‌ది వాస్త‌వం.