విజయవాడ సబ్ జైల్లో ఉన్న వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తాజాగా ఆ పార్టీ అధినేత జగన్ పరామర్శించారు. అయితే.. సమయం సందర్భం లేకుండా.. రాజు వెడలె రవి తేజములలరగ! అన్నట్టుగా జైలుకు కూడా మందీ మార్బలాన్ని వేసుకుని వచ్చేశారు. స్థానిక నాయకులు అయితే.. తమ బలప్రదర్శనకు జైలునే వేదికగా చేసుకున్నారు. దీంతో విజయవాడ నడిబొడ్డున ఉన్న ఈ జైలు ప్రాంతం మొత్తం నారా రభసగా మారింది.
విజయవాడ గాంధీనగర్‌లోని సబ్ జైలులో వంశీ 14 రోజుల రిమాండ్ నిమిత్తం ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం జగన్.. వంశీని పరామర్శించేందుకు వచ్చారు. ఈ క్రమంలో స్థానిక నాయకులు తమ పరివారంతో సహా వచ్చి.. జగన్ ముందు బల ప్రదర్శనకు దిగారు. దీంతో కార్యకర్తలు రహదారులపై హల్చల్ చేయడంతోపాటు.. జైలు గేట్లు కూడా నెట్టుకుంటూ లోపలికి వెళ్లారు. నిబంధనల ప్రకారం ఒకే సారి 50 మందికి మించి కార్యకర్తలు రాకూడదు.
కానీ, తాజాగా 500 మందికి పైగా కార్యకర్తలు.. జైలు ఆవరణను చుట్టుముట్టడంతో పోలీసులు సైతం వారిని నిలువరించలేక చేతులు ఎత్తేశారు. అయితే.. వైసీపీ కార్యకర్తలు.. ఏదైనా దాష్టీకానికి పాల్పడుతారేమోన న్న సందేహాలతో .. చుట్టుపక్కల ఉన్న హోటళ్లు, దుకాణాలను తాత్కాలికంగా పోలీసులు మూసి వేయించారు. అదేసమయంలో ట్రాఫిక్‌ను కూడా దారి మళ్లించారు. దీంతో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బంది ఏర్పడింది. సాధారణ ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడ్డారు.
సుమారు గంటన్నర పాటు జగన్.. జైలు వద్ద గడిపారు. మీడియాతో మాట్లాడడంతో పాటు.. 20 నిమిషాలు వంశీతోనూ ఆయన భేటీ అయ్యారు. బయటకు వచ్చాక యథాలాపంగా సర్కారుపై నిప్పులు చెరిగారు. రెడ్ బుక్ పాలనకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకులను అరెస్టు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.