వైసీపీ అధినేత జగన్.. జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై కేసు పెట్టి సత్యవర్థన్ అనే వ్యక్తిని బెదిరించి, కిడ్నాప్ చేసి.. కేసును వెనక్కి తీసుకునేలా చేశారన్న అభియోగంపై ఆయనను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో వంశీ ఉన్నారు. వంశీని పరామర్శించిన అనంతరం.. జగన్ మాట్లాడుతూ.. అసలు ఆ టీడీపీ కార్యాలయం కేసుకు, వంశీకి సంబందం లేదని చెప్పారు. అంతేకాదు.. టీడీపీ నాయకుడు పట్టాభి రాం రెచ్చగొట్టడం వల్లే.. ఆ దాడి జరిగిందన్నారు.
ఈ వ్యవహారంలో వైసీపీ నాయకుల ప్రమేయం అసలు లేనేలేదని జగన్ చెప్పారు. అయితే.. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. `ఫేక్-రియల్` అంటూ.. ఓ వీడియోను విడుదల చేశారు. దీనిలో జగన్ చేసిన వ్యాఖ్యలు.. దాని పక్కనే టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి.. నాడు వాహనాలు తగల బడుతున్న దృశ్యాలను పేర్కొన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలకు.. జరిగిన ఘటనకు ఏమాత్రం పొంతన లేదని నారా లోకేష్ సాక్ష్యాధారాలతో సహా వివరించారు.
“నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ రెడ్డి గారు? పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో మీరు పీహెచ్‌డీ చేసినట్టు ఉన్నారు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రండి. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేయడం కోట్లాది ప్రజలు కళ్లారా చూసారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు `మీ బ్రాండ్` జగన్ రెడ్డి గారు. అధికారం ఉన్నప్పుడు యథేచ్చగా చట్టాలను తుంగలో తొక్కి… ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ మీరు లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది“ అని నారా లోకేష్ నిప్పులు చెరిగారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates