వైసీపీ శ్రేణుల నినాదాల హోరుతో మంగళవారం విజయవాడలోని జైలు ప్రాంగణం మారుమోగిపోయింది. అసలే అది జిల్లా జైలు ప్రాంగణం… అందులోనూ తమ పార్టీకి చెందిన ఓ కీలక నేత అరెస్టైతే… ఆయనను పరామర్శించేందుకు ఏకంగా పార్టీ అధినేతే అక్కడకు తరలివచ్చారు. అలాంటి సమయంలో పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలి కదా. మంగళవారం విజయవాడ జైలు పరిసరాల్లో అలాంటి పరిస్థితి ఏమీ కనిపించలేదు. ఒకటే అరుపులు. కేకలు. మిన్నంటే నినాదాలు. ఒకరు జై జగన్ అంటే.. మరొకరు సీఎం జగన్ అని… సీఎం సీఎం అంటూ పిచ్చి పట్టిన వారికి మల్లే ఒకటే గోల. ఈ గోల తట్టుకోవడం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగానే అలవాటు అయినట్టుంది గానీ… వైసీపీ నేతలైన పేర్ని నాని, కొడాలి నాని లాంటి వారికి ఇంకా అలవాటు కానట్టుంది. నానిలిద్దరూ నినాదాలు ఆపాలంటూ సైగలు చేస్తున్నా… పార్టీ శ్రేణులు ఇసుమంత కూడా పట్టించుకోలేదు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ కు బెదిరింపులు, కిడ్నాప్ లకు సంబంధించిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టైన సంగతి తెలిసిందే. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో వంశీని పోలీసులు విజయవాడలోని సబ్ జైలుకు తరలించారు. జైలులో ఉన్న వంశీని కలిసేందుకు మంగళవారం జగన్ వచ్చారు. జైలు అధికారుల అనుమతితో ఆయన వంశీతో ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు ప్రాంగణంలోనే మీడియాను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా వంశీ అరెస్టుకు దారి తీసిన పరిస్థితులు, ఈ వ్యవహారంలో వంశీకి జరిగిన అన్యాయం గురించి జగన్ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. నినాదాలతో జైలు పరిసరాలను హోరెత్తించాయి.
వంశీకి జరిగిన అన్యాయంపై జగన్ చెబుతున్న వివరాలు ఎక్కడ జనానికి చేరకుండాపోతాయేమోనని ఓ వైపు పేర్ని, కొడాలిలతో పాటుగా వంశీ సతీమణి పంకజశ్రీ కూడా నినాదాలు ఆపాలంటూ పదే పదే పార్టీ శ్రేణులకు చెప్పే యత్నం చేశాయి. ఈ క్రమంలో చేతులు ఊపుతూ నినాదాలు ఆపేయాలంటూ వార సైగలు చేశారు. అయితే వారి సైగలను పట్టించుకున్న వారే కనిపించలేదు. చేతులు ఊపి ఊపి ఇక లాభం లేదని భావించిన నేతలు.. పార్టీ శ్రేణులను నిలువరించే యత్నాలను ఆపేశారు. ఇంతగా నినాదాలు హోరెత్తుతున్నా కూడా జగన్ ఏమాత్రం తొట్రుపాటుకు గురి కాకుండానే మీడియాతో మాట్లాడారు. జగన్ లో కనిపించిన ఈ వైఖరిని చూసి… పార్టీ శ్రేణుల నినాదాలు ఆయనకు నచ్చి ఉంటాయిలే అని కొందరు.. జగన్ లో ఆ స్లోగన్ లు ఊపును పెంచి ఉంటాయిలే అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.