మొన్నటి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నాటి నుంచి పెద్దగా బయటకే రాని గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని మంగళవారం బయటకు వచ్చేశారు. అయితే ఆయనేదో ఒంటరిగా బయటకు రాలేదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి ఆయన బయటకు వచ్చారు. బయటకు రావడమేనా?… ఏకంగా మీడియాతోనూ ఆయన మాట్లాడారు. అయితే ఆ మాట తీరు మాత్రం స్పష్టంగా మారిపోయిందని చెప్పక తప్పదు. వాయిస్ లో బేస్ కూడా బాగానే తగ్గినట్టు కనిపించింది. గతంలో మాదిరిగా బెదిరింపు ధోరణి, టేకిట్ ఈజీ స్టైల్ మాత్రం నాని మాట తీరులో మిస్సయ్యింది. వెరసి నాని పూర్తిగా మారిపోయారే అనే మాట అయితే ఒకింత గట్టిగానే వినిపించిందని చెప్పక తప్పదు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడిలో ప్రధాన ఫిర్యాదుదారుడి కిడ్నాప్ నకు సంబంధించిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయవాడలోని జైల్లో ఉన్న వంశీని కలిసేందుకు మంగళవారం జగన్ అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా జగన్ తో కలిసి అక్కడికి వచ్చిన కొడాలి నాని… చలాకీగానే కనిపించారు. వైసీపీ నేతలు పేర్ని నాని, నందిగం సురేశ్, తలశిల రఘురాం తదితరులతో కలిసి జైలు బయటే నిలబడిపోయిన కొడాలి నాని తనను పలకరించిన మీడియాతో పొడిపొడిగా మాట్టాడారు. కేసులకు తానేమీ భయపడేది లేదని గతంలో పదే పదే చెప్పిన నాని నోట ఇప్పుడు ఆ మాట వినిపించలేదని చెప్పాలి. కేసులుంటే లాయర్లు ఉన్నారుగా అంటూ ఆయన చేసిన వ్యాఖ్య నిజంగానే వైరల్ అయ్యింది.
అయినా ఈ సందర్భంగా కొడాలి నాని ఏమన్నారన్న విషయానికి వస్తే.. వంశీ తర్వాత అరెస్ట్ మీదేనంట కదా. రెడ్ బుక్ లో అదే రాశారట కదా. ఆ బుక్ ఆధారంగా తర్వాతి అరెస్ట్ మీదే కదా అంటూ ఓ లేడీ జర్నలిస్టు ప్రశ్నిస్తే.. తాను రెడ్ బుక్ ను చూడలేదని, మీరు ఏమైనా ఆ బుక్ ను చూశారా? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఆ బుక్ ను ఎవరూ నాకు చూపించలేదన్న నాని… మీకేమైనా చూపించారా? అని ప్రశ్నించారు. పార్టీలో అయితే మీరున్నారుగా అని జర్నలిస్టు ప్రశ్నిస్తే… వైసీపీలో అని ఆమె బదులిచ్చారు. ఆ పార్టీలో లేనని మీరే చెబుతున్నారుగా అంటూ తిరిగి నాని అన్నారు. ఈ రెడ్డు బుక్కులు, బ్లూ బుక్కులతో ఏం ఉపయోగం లేదని ఆయన అన్నారు. మీపై ఇప్పటికే 3 కేసులు ఫైల్ అయ్యాయని జర్నలిస్టు అంటే… మూడు కాకుంటే ముప్పై కేసులు కానివ్వండి… ఇంత మంది లాయర్లు ఉన్నదెందుకు? అంటూ నాని వ్యాఖ్యానించారు.