వైసీపీ అధినేత జగన్ గత ఎన్నికలకు ముందు.. చేసిన ప్రయోగాలు వికటించాయి. ఎమ్మెల్యేలను, ఎంపీ లను మార్పు చేయడంతోపాటు.. తాను ఏరికోరి ఎంపిక చేసిన వారికి ఇచ్చిన టికెట్ల స్థానాల్లోనూ పార్టీ ఘోర పరాజయం పాలైంది. సరే.. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు కామనే.. అనుకున్నా.. తర్వాత జరిగిన పరిణామాలు కూడా వైసీపీకి ఏమాత్రం కలిసి రావడం లేదు. దీంతో ప్రయోగాలే కాదు.. నాయకులు కూడా కొరగాకుండా పోయారన్న చర్చ అయితే సాగుతోంది.
ఏం జరిగింది ..
గత ఎన్నికల సమయంలో తిరువూరు, మైలవరం, విజయవాడ పశ్చిమ సహా అనేక నియోజకవర్గాల్లో కొత్త ముఖాలకు అవకాశం కల్పించారు. వీరంతా సాధారణ వ్యక్తులే. అయినప్పటికీ.. వైసీపీ సర్కారు అమలు చేసిన నవరత్నాల కారణంగా.. ఎవరిని నిలబెట్టినా గెలిచేస్తారని జగన్ అంచనా వేసుకున్నారు. అందుకే ఎక్కడా ఎవరు వెళ్లిపోతున్నా.. జగన్ పట్టించుకోలేదు. కనీసం వారితో చర్చించే ప్రయత్నం కూడా చేయ లేదు. ఫలితంగా పదుల సంఖ్యలో వెళ్లిపోయారు.
ఆయా స్థానాల్లో కొత్త ముఖాలకు జగన్ అవకాశం ఇచ్చారు. వీరిని తానే గెలిపించుకుంటానని కూడా జగన్ చెప్పారు. అయితే.. వారు విజయం సాధించలేదు. కట్ చేస్తే.. ఓడిన వారు ఇప్పుడు ఎక్కడున్నారంటే.. గత ఎన్నికలకు ముందు ఏయే వృత్తుల నుంచి రాజకీయాల్లోకి వచ్చి వైసీపీ కండువా కప్పుకొన్నారో.. ఇప్పు డు ఆయా పనుల్లోనే వారు నిమగ్నమయ్యారు. దీంతో పార్టీ తరఫున వాయిస్ వినిపించే వారు లేకుండా పోయారు.
తమ తమ వృత్తులే తమకు కడుపునింపుతాయని కూడా చెబుతున్నారు. ఈ పరిణామాలతో మైలవరం, తిరువూరు, విజయవాడ వెస్ట్ వంటి నియోజకవర్గాల్లో సదరు నేతలు కనిపించడమే లేదు. ఇక్కడే కాదు.. గత ఎన్నికల్లో ప్రయోగాలు చేసిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలానే ఉంది. ఇక, నియోజకవర్గాలను మార్పు చేసిన చోట కూడా వైసీపీ మాట వినపడడం లేదు. దీంతో జగన్ చేసిన ప్రయోగాలతో పాటు.. తీసుకువచ్చిన నాయకులు కూడా వికటించారన్న చర్చ జోరుగా జరుగుతుండడం గమనార్హం.