“నావల్లే మీరంతా గెలిచారు. నన్ను చూసే ప్రజలు మీకు ఓట్లేశారు“ అంటూ.. 2019 ఎన్నికలకు ముందు.. తర్వాత కూడా వైసీపీ అధినేత జగన్ పలు మార్లు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తన పాలన సమయంలో నూ.. ఇదే తరహాలో వ్యవహరించారు. తనను చూసే.. ప్రజలు వైసీపీ నేతలను ఆదరిస్థున్నారని కూడా చెప్పుకొచ్చారు. దీంతో సీనియర్లు.. సీనియర్ మోస్టులు ఒకింత ఆవేదన చెందారు. అయినా.. జగన్ మాత్రం తన పంథాను మార్చుకోలేక పోయారు.
ఇక, గత ఏడాది ఎన్నికలకు ముందు.. ఈ `నేనే` అనే కాన్సెప్టును మరింత తీవ్రం చేశారు. సర్వం జగన్నా థం అన్నట్టుగా జగన్ వ్యవహరించారు. ఈ క్రమంలోనే తనకు అందిన సర్వేల ఆధారంగా.. అంటూ.. కీలక నేతలను బరి నుంచి తప్పించారు. అంతేకాదు.. తనకు నచ్చిన.. తాను మెచ్చిన వారిని తీసుకువ చ్చి నియోజకవర్గాలను అప్పగించారు. ఇంకేముంది.. తన ఇమేజ్.. తన ఫొటోతోనే అందరూ గెలిచేస్తారని కూడా చెప్పుకొచ్చారు.
కానీ.. ఈ వ్యూహం బెడిసి కొట్టింది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు వైసీపీ పడిపోయింది. అయితే.. ఈ సమయంలోనూ జగన్ ఇమేజ్ వ్యవహారం ప్రస్తావనకు వచ్చినా.. కూటమి చేసిన మంత్రాంగంతోనే.. తాము ఓడిపోయామని వైసీపీ నాయకులు సమర్థించుకున్నారు. దీనిలో జగన్ పాత్రలేదన్నారు. ఇక, కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రజలు నమ్మారని అందుకే.. వారికి అవకాశం ఇచ్చారని కూడా నాయకులు వ్యాఖ్యానించారు.
కట్ చేస్తే.. జగన్ ఇమేజ్ ఏమైనా పెరిగిందా? అంటే.. లేదనే చెప్పాలి. ఇప్పటికి ఎన్నికలు పూర్తయి 9 మాసాలు జరిగినా.. ఇప్పటి వరకు జగన్ ఇమేజ్ పెరిగిన దాఖలా అయితే కనిపించడం లేదు. పైగా.. జగన్ పిలుపునిస్తున్నా.. ఉద్యమాలు, నిరసనలకు రావాలని కోరుతున్నా.. ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు . ఈ పరిణామాలతో.,. జగన్ ఇమేజ్ డీలా పడినట్టేనని కూటమి నాయకులు చెబుతున్నారు.
అయితే.. వైసీపీలోని జగన్ అభిమానులు మాత్రం మరో విధంగా చర్చిస్తున్నారు. ప్రస్తుతం ప్రజలు ఆలోచన చేస్తున్నారని.. త్వరలోనే తమ నాయకుడి విషయంలో పాజిటివిటీ పెరుగుతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.