మ‌హిళ‌పై దాడి.. కోర్టులో లొంగిపోయిన వైసీపీ మాజీ ఎంపీ

వైసీపీ కీల‌క నాయ‌కుల‌ను కేసులు వెంటాడుతున్నాయి. ఒక కేసు నుంచి బ‌య‌ట ప‌డ్డామ‌ని అనుకుంటే… వారు చేసిన త‌ప్పు లు మ‌రిన్ని కేసుల రూపంలో నాయ‌కుల‌ను వెంటాడుతున్నాయి. ఇటీవ‌లి వ‌ర‌కు జైల్లో ఉండి.. కొన్నాళ్ల కింద‌టే బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన బాప‌ట్ల మాజీ ఎంపీ.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నందిగం సురేష్ తాజాగా మ‌రో కేసులో చిక్కుకున్నారు. ఈ నేప‌థ్యంలో తానే స్వ‌యంగా గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలోని జూనియ‌ర్ సివిల్ జ‌డ్జి ఎదుట సోమ‌వారం సాయంత్రం లొంగిపోయారు. అనంత‌రం.. ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఏం జ‌రిగింది?

వైసీపీ హ‌యాంలో రాజ‌ధాని అమ‌రావ‌తిని కాద‌ని.. మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. దీనికి వ్య‌తిరేకంగా రాజ‌ధాని రైతులు పెద్ద ఎత్తున ఉద్య‌మించారు. వీరిలో మ‌హిళా రైతులు కూడా ఉన్నారు. ఏళ్ల త‌ర‌బ‌డి జ‌రిగిన ఈ ఉద్య‌మం దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం రేకెత్తించింది. రాజ‌ధాని కోసం ఉద్య‌మించిన రైతులుగా వారు రికార్డు సృష్టించారు. అయితే.. ఈ స‌మ‌యంలో మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా అప్ప‌టి ఎంపీ నందిగం సురేష్ మ‌రో ఉద్య‌మానికి శ్రీకారం చుట్టారు. అమ‌రావ‌తి కంటే మూడురాజ‌ధానులే కావాలంటూ.. వారంతా ఉద్య‌మించారు.

ఈ క్ర‌మంలో అటు రాజ‌ధాని రైతుల శిబిరాల‌కు స‌మీపంలోనే మూడు రాజ‌ధానులు కావాలంటూ ఆందోళ‌న చేప‌ట్టిన వారు కూడా శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇది రైతుల‌కు-రైతుల‌కు మ‌ధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఈ క్ర‌మంలో జోక్యం చేసుకు న్న అప్ప‌టి ఎంపీ నందిగం.. రాజ‌ధాని రైతుల‌ను దూషించారు. ముఖ్యంగా మండ‌వ మ‌హాల‌క్ష్మి అనే మ‌హిళ‌పై బూతుల‌తో విరుచుకుప‌డ్డారు. అప్ప‌ట్లో ఆమెను కొట్ట‌బోయిన‌ట్టు కూడా ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న‌పై మ‌హాల‌క్ష్మి 2020లోనే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కానీ, వైసీపీ హ‌యాంలో ఈ కేసు ముందుకు సాగ‌లేదు.

ఇటీవ‌ల మ‌రోసారి మ‌హాల‌క్ష్మి.. పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతోపాటు.. టీడీపీ మంగ‌ళ‌గిరి కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన గ్రీవెన్స్‌లోనూ ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి నారా లోకేష్ సూచ‌న‌ల మేర‌కు స‌త్తెన‌ప‌ల్లి పోలీసులు.. ఈ కేసు ఫైలు దుమ్ము దులిపారు. దీనిపై ఎఫ్ ఐఆర్ న‌మోదు చేశారు. ఈ విష‌యం తెలియ‌డంతో అరెస్టు క‌న్నాముందే.. నందిగం సురేష్ సోమ‌వారం.. కోర్టులో లొంగిపోయారు. బెయిల్ పిటిష‌న్‌పై వాద‌న‌లు ముగియ‌డంతో ఆయ‌న‌కు బెయిల్ ఇస్తూ.. న్యాయాధికారి.. ఆదేశాలు జారీ చేశారు.