టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లో రాటుదేలి పోతున్నారు. ఇటు రాజకీయాల్లోనే కాకుండా అటు ప్రజా పాలనలోనూ లోకేశ్ దూసుకుపోతున్నారు. 23 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లకు పరిమితమైపోయిన టీడీపీ యువగళం పేరిట చేపట్టిన తన పాదయాత్రతో ఏకంగా 135 ఎమ్మెల్యే, 18 ఎంపీ సీట్లు కలిగిన పార్టీగా లోకేశ్ మార్చడంలో సఫలీకృతం అయ్యారు.
లోకేశ్ లో కనిపించిన ఈ ట్రాన్స్ ఫార్మేషన్ ను చూసిన వారు ఎవరైనా ఆయనను మెచ్చుకోకుండా ఉండలేరు. దగ్గరగా కనిపిస్తే లోకేశ్ భుజం తట్టకుండా ఉండలేరు. రాజకీయాల్లో తలపండిన వారైతే శభాష్ లోకేశ్ అని ప్రశంసించకుండా కూడా ఉండలేరు. ఆ తలపండిన నేతలు వైరి వర్గాలకు చెందిన వారైనా కూడా లోకేశ ను కీర్తించకుండా ఉండలేరు.
ఈ మాట నిజమేనన్నట్లుగా ఆదివారం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైసీపీకి చెందిన సీనియర్ మోస్ట్ నేత, నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి… లోకేశ్ కనిపించినంతనే లేచి నిలబడి మరీ… లోకేశ్ భుజం తడుతూ.. శభాష్ లోకేశ్ అంటూ ప్రశంసించారు. అది కూడా అందరూ చూస్తుండగానే.. లోకేశ్ ను మేకపాటి మెచ్చుకున్నారు.
ఈ ఘటన ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలోని స్వర్ణభారతి ట్రస్టు ఆవరణలో చోటు చేసుకుంది. ట్రస్ట్ ఆవరణలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మనవడి వివాహ రిసెప్షన్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి లోకేశ్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి వస్తున్న సందర్భంగా తనకు ఎధురేగి స్వాగతం పలికిన దాదాపుగా అన్ని పార్టీల నేతలను పలకరిస్తూ లోకేశ్ సాగారు.
ఈ క్రమంలో మేకపాటి కనిపించగానే… ఆయనకు లోకేశ్ నమస్కరించారు. లోకేశ్ ను చూసినంతనే తాను కూర్చున్న సోఫాలో నుంచి లేచి నిలబడ్డ మేకపాటి… లోకేశ్ భుజాన్ని తట్టి… శబాష్ లోకేశ్ అంటూ ప్రశంసించారు. అటు పార్టీ వ్యవహారాల్లోనే కాకుండా ఇటు పాలనలోనూ సత్తా చాటుతున్నారంటూ ఆయన లోకేశ్ ను ఆకాశానికెత్తేశారు. ఈ వీడియో కాస్తంత ఆలస్యంగా సోమవారం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి వైరల్ గా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates