ఇటీవల కాలంలో ఏ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఐఏఎస్ అధికారుల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఒక మాజీ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణనాయుడు రచించిన ‘లైఫ్ ఆఫ్ ఎ కర్మయోగి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వేళ.. ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
అధికారులు మంచీ చెడులపై సలహా చెప్పేలా ఉండాలని.. రాజకీయ నేతలు ఇస్తున్న ఆదేశాల్లో తప్పొప్పులను ఎత్తి చూపాలన్న ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ నేతలు ఇస్తున్న తప్పు ఒప్పులను ఎత్తి చూపటం మానేసి.. ఒక తప్పు చేయమంటే మూడు తప్పులు చేస్తున్నారన్నారు.
‘గతంలో అధికారుల తీరు వేరుగా ఉండేది. రాజకీయ నేతలు తీసుకునే నిర్ణయాల్లో తప్పులను ఒప్పులను ఎత్తి చూపేవారు. ఇప్పుడు ఆ వైఖరి కరువైంది. ఒక తప్పు చేయమంటే.. మూడు తప్పులు చేద్దామనే అధికారుల్ని చూస్తున్నా. సమాజానికి ఇది మంచిది కాదు. ప్రభుత్వ అధికారుల వ్యవహారశైలి మీద తాను ఏ మాత్రం సంతోషంగా లేనన్నారు.
ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు ఏసీ గదుల నుంచి బయటకు రావటం మానేశారు. ఏసీ అనేది జబ్బేమో? ఆఫీసుల్లో కూర్చుంటే ప్రయోజనం ఉండదు’’ అని వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్ నుంచి మొదలైన తన రాజకీయ ప్రయాణంలో చాలావరకు ప్రతిపక్షంలోనే ఉన్నట్లుగా చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్.. ‘అప్పట్లో కలెక్టర్లు మారుమూల ప్రాంతాల్లో పర్యటించి ఆయా గ్రామాల సమస్యల్ని తెలుసుకొని.. పరిష్కరించేవారు.
ఇప్పటికి నేను గ్రామాలకు వెళుతున్నా. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తమ ఊరికి కలెక్టర్ వచ్చినట్లుగా అక్కడి ప్రజలు చెబుతున్నారు. దీంతోనే నాటి అధికారులు ప్రజలతో ఎలా ఉన్నారో.. ఎలాంటి ముద్ర వేసుకున్నారో నేటి అధికారులు తెలుసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. గతంలో రాజకీయ నేతలు ఏదైనా అంశాన్ని ప్రస్తావిస్తే.. అందులోని లోటుపాట్లను.. లాభనష్టాల్ని వివరంగా చెప్పేవారని.. చట్టవిరుద్ధంగా వెళితే ఎదురయ్యే సమస్యల్ని వివరంగా చెప్పేవారని.. ఇప్పుడు ఆ తీరు తగ్గిపోయిందన్నారు.
‘‘ఈ పరిస్థితికి కారణం ఏమిటో నాకు తెలియదు. రాజకీయ నాయకుల్ని సంతోష పెట్టాలన్నట్లుగా ప్రతి నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వారి చదువు వేరు. అనుభవం వేర్వేరు కావొచ్చు. ఏమీ చదువుకోని వారికి విద్యాశాఖను కూడా ఇవ్వొచ్చు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ జాబ్ కు.. వారి చదువుకు ఏ మాత్రం సంబంధం ఉండదు. అందుకే.. రాజకీయ నేతలకు అవగాహన కల్పించేందుకు సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం అధికారులు అవసరమవుతారు.
వారు ఏ ఫైలు వచ్చినా.. అందులోని తప్పొప్పులు చెప్పాలి’ అన్న అభిలాషను ముఖ్యమంత్రి రేవంత్ వ్యక్తం చేశారు. నిబద్ధత కలిగిన అధికారులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందన్న ముఖ్యమంత్రి రేవంత్.. పేదలకు సాయం చేయాలన్న ఆలోచన అధికారులకు ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్లు.. ఎస్పీలను తరచూ మాజీ అధికారులతో సదస్సుల ద్వారా కలుసుకునే అవకాశం కల్పించాలని సీఎస్ శాంతికుమారికి సూచన చేశారు సీఎం రేవంత్. దేన్నైనా కొనొచ్చు కానీ అనుభవాన్ని మాత్రం కొనలేమన్నారు ముఖ్యమంత్రి రేవంత్.
‘‘శంకరన్.. మన్మోహన్ సింగ్.. శేషన్ లను గుర్తు తెచ్చుకోవాలి. నిబద్ధతతో పని చేసిన గొప్ప అధికారి శంకరన్. పారదర్శక ఎన్నికల నిర్వహణకు శేషన్.. దేశాన్నిఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి మన్మోహన్. అలాంటి సివిల్ సర్వెంట్ల అనుభవాలను నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది’’ అంటూ తన అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్.
అంతా బాగానే ఉంది కానీ.. మరి.. కమిట్ మెంట్ తో ఉన్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు కట్టబెట్టే క్రమానికి చెక్ పెడితే.. తాజాగా చేసిన వ్యాఖ్యలకు ఒక అర్థముంటుందన్న విషయాన్ని సీఎం రేవంత్ గుర్తిస్తారా?