పాలిటిక్స్ పై నాని యూటర్న్… బీజేపీలోకి మాజీ ఎంపీ??

ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చి…ఆ వాసన చూశాక దానికి దూరంగా జరగడం దాాదాపుగా దుర్లభమేనని చెప్పక తప్పదు. ఎందుకంటే… అన్ని రంగాలను శాసిస్తున్న రాజకీయ రంగం… అన్నింటికీ పెద్దన్నగా వ్యవహరిస్తోంది. ఏ పని కావాలన్నా… ఎవరితో కాకున్నా.. ఒక్క రాజకీయ నేత తలచుకుంటే… ఆ పని నిమిషాల్లో పూర్తి అయిపోతుంది.

పార్టీ ఏదన్నది ముఖ్యం కాదు. నేతకు లౌక్యం ఉంటే చాలు ఇట్టే పనులన్నీ అయిపోతాయి. కోరినవన్నీ సమకూరిపోతాయి. డబ్బే దస్కం కూడా వద్దన్నా వచ్చి చేరుతూనే ఉంటాయి.

అందుకే కాబోలు…ఇక రాజకీయాలకు నమస్కారం అటూ సంచలన ప్రకటన చేసిన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని… తన స్టాండ్ పై యూటర్న్ తీసుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన ఆయన ఇప్పుడు తన మనసును మార్చుకున్నట్టు తెలుస్తుంది.

తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ఆయన దాదాపుగా సిద్ధం అయిపోయారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన నాని… బీజేపీలో తన చేరికకు మార్గం సుగమం చేసుకున్నారు. అతి తొందరలోనే అధికారికంగానూ ఆయన బీజేపీలో చేరిపోతారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

కేశినేని ట్రావెల్స్ అధినేతగా సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న కేశినేని నాని… టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన విజయం సాధించారు. 2019లోనూ అదే స్థానం నుంచి ఆయనకు టీడీపీ అవకాశం కల్పించగా…వరుసగా రెండో సారి కూడా విజయం సాధించారు.

టీడీపీలో ఆయనకు మంచి ప్రాదాన్యమే లభించించింది. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నుంచి ఫ్రీ హ్యాండ్ లభించిన నాని… విజయవాడ లోక్ సభ పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి… తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

అయితే కుటుంబంలో నెలకొన్న విబేధాల కారణంగా టీడీపీకి దూరంగా జరిగిన నాని…ఉన్నట్టుండి వైసీపీలో చేరిపోయారు. 2024 ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి…టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన సొంత తమ్ముడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని చేతిలో ఓటమిపాలయ్యారు.

దీంతో షాక్ తిన్న నాని… ఇక తాను రాజకీయాల్లో కొనసాగబోనంటూ సంచలన ప్రకటన చేశారు. అయితే… రాజకీయాలను విడిచి ఆయన ఉండలేకపోతున్నారన్న వాదనలు వినిపించగా…ఆ మాట నిజమేనన్నట్లుగా తిరిగి రాజకీయాల్లోకి వచ్చే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. టీడీపీతో మిత్రపక్షంగా సాగుతున్న బీజేపీలో చేరే నాని… సోదరుడితో కలిసి ఎలా సాగుతారోనన్న అంశంపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.