తిరుపతి వేదికగా ఒకే స్టేజీపై ముగ్గురు సీఎంలు?

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి వేదికగా రేపు ఓ అరుదైన సన్నివేశం ఆవిష్కృతం కానుంది. ఒకే వేదికను ముగ్గురు సీఎంలు పంచుకోనున్నారు. ఇందుకు తిరుపతి వేదికగా రేపు ప్రారంభం కానున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం కానుంది.

ఈ వేదికకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో పాటుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ లు హాజరు కానున్నారు. వీరిలో చంద్రబాబు టీడీపీ అధినేతగా ఉండగా.. మిగిలిన ఇద్దరు సీఎంలు బీజేపీ నేతలుగా ఉన్నారు.

అంతర్జాతీయ స్థాయి సమావేశం కావడంతో ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అధికారిక కార్యక్రమంగా జరుగుతున్న ఈ ఎక్స్ పోకు ఏపీ తరఫున సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. అదే సమయంలో ఏపీ నుంచి ఆహ్వానాలు అందుకున్న ఫడ్నవీస్, సావంత్ లు కూడా విశిష్ట అతిథులుగా హాజరు కానున్నారు.

ఈ కార్యక్రమంలో ఆయా ఆలయాల విశిష్టతలను తెలుపుతూ బారీ ప్రదర్శనలు ఉండనున్నట్లు సమాచారం. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.

భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపుగా 15 వేల ఆలయాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఆలయాల నిర్వహణ, అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను ఆలయాల నిర్వహణలో సమర్థవంతంగా వినియోగించుకునే విషయాలపై ఈ సదస్సులో కీలక చర్చ జరగనుంది.

అంతేకాకుండా ఆయా ఆలయాల పవిత్రతను కాపాడే దిశగా చేపట్టాల్సిన చర్యలపైనా ఈ సదస్సులో చర్చ జరగనున్నట్లు సమాచారం. ఆయా ఆలయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలు, వాటి మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపైనా విస్తృత స్థాయిలో చర్చ జరగనున్నట్లు సమాచారం.