ఎర్రన్నలు… అదేనండి మన వామపక్ష పార్టీలకు చెందిన నేతలు ఎప్పుడేం మాట్లాడతారో కూడా అర్థం కాదు. అసలే జనాల్లో పట్టు కోల్పోయిన ఎర్ర దండు నేడో, రేపో దుకాణాలు పూర్తిగా బంద్ చేసుకోక తప్పని పరిస్థితులు కనపడుతున్నాయన్న వాదనలు తరచూ వినిపిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దుకునే పనిని పక్కనపెట్టేసిన లెప్ట్ పార్టీ నేతలు.. అధికారంలో ఉన్న నేతలు.. అది కూడా పోటీ చేసిన అన్ని స్థానాలను గెలిచిన.. 100 శాతం స్ట్రైక్ రేటును సాధించిన జనసేన లాంటి పార్టీని.. ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పదవిలో ఉంటే… గుళ్లు, గోపురాలకు దూరంగా ఉండాలన్న దిశగా సీపీఐ కీలక నేత రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు నిజంగానే వింతగా ఉన్నాయని చెప్పక తప్పుదు.
ధర్మ పరిరక్షణ యాత్ర పేరిట పవన్ కల్యాణ్ 3 రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను సందర్శించారు. కుమారుడు అకీరా నందన్ ను వెంటేసుకుని బయలుదేరిన పవన్…. 3 రోజుల పాటు యాత్రలో నిష్టగా కొనసాగారు. యాత్రకు బయలుదేరిన నాటి నుంచి యాత్రను ముగించి తిరిగి వచ్చేదాకా ఆయన కాషాయ దుస్తుల్లోనే కనిపించారు.
కాళ్లకు ప్యారగాన్ చెప్పులను వేసుకుని అత్యంత సాధారణ వ్యక్తిగా కనిపించారు. మొత్తంగా ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వస్తున్న తన ఆధ్యాత్మిక యాత్ర ఇప్పటికి గానీ పూర్తి కాలేదని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆధ్యాత్మిక యాత్రలో పవన్ పాలనను పక్కనపెట్టినా… ఆయన శాఖకు చెందిన అధికార యంత్రాంగం లోటు లేకుండానే అన్ని కార్యక్రమాలను యధాతథంగానే కొనసాగించింది.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో శనివారం మీడియా ముందుకు వచ్చిన సీపీఐ రామకృష్ణ.. పవన్ తీరుపై నిప్పులు చెరిగారు. పాలనను పక్కన పెట్టి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారా.? రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి గుళ్లు, గోపురాలు పట్టుకుని తిరుగుతారా? అంటూ ఓ రేంజిలో ఫైరయ్యారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్… పాలనను పక్కన పెట్టి కాషాయ వస్త్రాలు ధరించారంటూ ఆయన అభ్యంతరం తెలిపారు.
రాష్ట్రాన్ని కూటమి సర్కారు ఆదానికి దోచిపెడుతుంటే… పవన్ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించడానికే పుట్టానని ప్రకటించిన పవన్ ను ప్నజలు నమ్మి ఓట్లేస్తే.. పవన్ ఏమో ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేశారంటూ సెటర్లు సంధించారు. రామకృష్ణ ఆరోపణలపై ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయి.
మీరు ఎర్ర బట్టలు కట్టి ప్రజలకు ఏం చేశారు?… మీ ఆస్తులు పెంచుకోవడం తప్ప.. అంటూ నెటిజన్లు రామకృష్ణను ఏకిపారేస్తున్నారు.