ఆ రెండు కారణాలే అనిల్ ను బలి చేశాయా…?

వైసీపీలో అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. టీడీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు సిటీ అసెంబ్లీ నుంచి వరుసబెట్టి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ ను మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు అక్కడి నుంచి బదిలీ చేశారు.

నెల్లూరు జిల్లాను దాటించి… ఏకంగా పల్నాడు జిల్లాకు బదిలీ అయిపోయిన అనిల్… నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే టీడీపీకి అనుకూలంగా వీచిన గాలిలో అనిల్ పరాజయం పాలయ్యారు. అటు నెల్లూరు సిటీ కూడా వైసీపీ చేతిలో నుంచి టీడీపీ ఖాతాలో పడిపోయింది.

అయినా ఉన్నట్టుండి… అనిల్ నెల్లూరు సిటీ నుంచి బదిలీ అయిపోవడానికి గల కారణాలు ఏమిటన్న దిశగా చర్చ సాగినా… పెద్దగా రీజన్లు బయటకు రాలేదు. తాజాగా ఆ కారణాలేమిటన్న దానిపై ఇప్పుడు వైసీపీలో జోరుగా చర్చ సాగుతోంది.

బీసీ సామాజిక వర్గానికి చెందిన అనిల్… కేవలం రెండు కారణాలతోనే నెల్లూరు నుంచి ఓడిపోయే నరసరావుపేట పార్లమెంటుకు బదిలీ అయిపోయారని ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నప్పటికీ అనిల్… ఆ రెండు కారణాలతోనే ఆయనకు దూరమైపోయారన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో అనిల్ కలిసి సాగలేకపోయారు. కాకాణి, అనిల్ ల మధ్య నిత్యం వివాదాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో కాకాణికి జగన్ నుంచి మద్దతు లభించగా… అనిల్ మాత్రం ఒంటరి అయిపోయారట. కాకాణితో విభేధాలు ఎందుకంటూ జగన్ కోటరీ నుంచి వచ్చిన హెచ్చరికలను కూడా అనిల్ ఖాతరు చేయలేదట.

అదే సమయంలో పార్టీని వీడిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో అనిల్ సఖ్యతగా మెలగుతున్నారన్న ఫిర్యాదులు రాగా… అనిల్ ను జగన్ క్షణాల్లో నెల్లూరు సిటీ నుంచి బదిలీ చేసారని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఓ వైపు కాకాణితో గొడవలు, మరోవైపు వేమిరెడ్డితో సఖ్యతలే అనిల్ కొంప ముంచాయని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.