కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు కొలువు దీరిన తర్వాత… బీజేపీ నేతలు ఎక్కడకెళ్లినా… డబుల్ ఇంజిన్ సర్కారు అంటూ పదే పదే ఆ కొత్త పదబంధాన్ని ప్రయోగించారు. డబుల్ ఇంజిన్ అంటే… కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే… రాష్ట్రాల్లోనూ అదే పార్టీ అధికారంలోకి రావడమన్న మాట.
ఇలా డబుల్ ఇంజిన్ పాలన వచ్చిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి నిధుల కొరత ఉండదని, అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవని బీజేపీ చెబుతూ వచ్చింది. ఇదే మాటతోనే ఆ పార్టీ దేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేసింది కూడా.
డబుల్ ఇంజిన్ సర్కారు పాలనను దాటేసిన బీజేపీ… ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ పాలన అంటూ సరికొత్త పదబంధాన్ని వాడుకలోకి తీసుకుని వస్తోంది. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన బీజేపీ… అక్కడి మునిసిపల్ కార్పొరేషన్లలోనూ పాగా వేయాలని ప్లాన్ రచిస్తోంది.
అందులో భాగంగా మొన్నటిదాకా ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు శనివారం బీజేపీలో చేరారు. వీరికి బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా కాషాయ జెండాలు కల్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సచ్ దేవా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది… మొన్ననే ఢిల్లీ సీఎం పీఠాన్ని కూడా బీజేపీ చేజిక్కించుకుంది. త్వరలో జరగనున్న ఢిల్లి నగర పాలికల ఎన్నికల్లోనే విజయమే లక్ష్యంగా బీజేపీ సాగుతుంది.. ఫలితంగా ఢిల్లీలో ఇకపై ట్రిపుల్ ఇంజిన్ పాలన అమలులోకి వస్తుంది” ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏప్రిల్ లో ఢిల్లీ నగర పాలక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లోగా ఢిల్లీలో ఆప్ ప్రభావాన్ని జీరో స్థాయికి తగ్గించి… ఢిల్లీ మునిసిపాలిటీపైనా కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. చూద్దాం మరి సచ్ దేవా చెప్పినట్లుగా ఢిల్లీలో ట్రిపుల్ ఇంజిన్ పాలన వస్తుందో?.. లేదో?