సినిమాలు, వాటి ఇతివృత్తాలపై బీజేపీ సీనియర్ నేత, ఏపీ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం రాత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. బందిపోట్లు, స్మగ్లర్ల బయోగ్రఫీలతో సినిమాలేంటి అని ప్రశ్నించిన మంత్రి…ఆ సినిమాల ద్వారా సభ్య సమాజానికి ఎలాంటి సందేశాలు ఇస్తున్నారంటూ ఒంటికాలిపై లేచారు.
తమకు జన్మనిచ్చిన ప్రాంతాల అభివృద్ధి కోసం పాటు పడిన వారి జీవితాలను ఇతివృత్తంగా తీసుకుని సినిమాలు తీస్తే… సమాజాభివృద్ధికి దోహదం చేసినట్టు అవుతుందని కూడా ఆయన వ్యాఖ్యానిచారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారిపోయాయి.
ఏపీలోని నంద్యాల పట్టణంలో గురు రాఘవేంద్ర ఎడ్యుకేషనల్ సొసైటీల 23వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి ఓ కార్యక్రమం జరగగా… దానికి సత్యకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్యాంకు ఉద్యోగాల కోచింగ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో నంద్యాల గురు రాఘవేంద్ర సంస్థలకు మంచి పేరుంది.
ఈ సంస్థల్లో శిక్షణ తీసుకున్న వేలాది మంది యువతీయువకుల్లో 43 వేల మంది బ్యాంకుల్లో కొలువులు సంపాదించారు. ఈ క్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపకులు పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డిని అభినందించిన సత్యకుమార్… దస్తగిరి రెడ్డి లాంటి వారి బయోగ్రఫీలతో సినిమాలు తీస్తే ఉపయోగం ఉంటుందంటూ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం వస్తున్న సినిమాలు… వాటిలో జనానికి చూపుతున్న కథలు, బయోగ్రఫీలు చూస్తుంటే… ఆశ్చర్యం వేస్తోందని సత్యకుమార్ అన్నారు. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తే బాగుంటుందని ఆయన అన్నారు. నేర ప్రవృత్తితో తీసే సినిమాలతో సమాజంలోనూ అవే ధోరణులు పెరిగిపోతాయని ఆయన ఆంధోళన వ్యక్తం చేశారు.
అయితే తాను ఏ ఒక్కరినో ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని కూడా సత్యకుమార్ అన్నారు. ఎవరినీ ఉద్దేశించి చేయకున్నా… మొత్తంగా సినిమాలను టార్గెట్ చేసిన సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారన్న వాదనలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి.