ప్రమెుఖ సినీ గాయని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేస్తూ శనివారం ఓ బహిరంగ ప్రకటనను విడుదల చేసింది. తన పాటకు రాజకీయ ముద్ర ఆపాదిప్తున్నారని ఆరోపించిన మంగ్లీ… ఆ కారణంగా తనకు అవకాశాలు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
అయినా తాను రాజకీయంగా ఏ ఒక్క పార్టీకో అనుకూలంగా, మరో పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తానని కూడా ఆమె వాపోయింది. తన వృత్తి పాటలు పాడటమే గానీ… రాజకీయాలు చేయడం కాదని, రాజకీయాలతో తనకు సంబంధమే లేదని ఆమె గుర్తు చేసింది.
ఇటీవల శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి ఆలయ రథ సప్తమి వేడుకల్లో మంగ్లీ పాలుపంచుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ యువ నేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆహ్వానంతో ఈ వేడకలకు తాను హాజరయ్యానని మంగ్లీ తెలిపింది.
ఈ వేడుకల్లో మంగ్లీ పాల్గొనడం, ఆమెను మంత్రి వెంటబెట్టుకుని వెళ్లిన తీరుపై టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. టీడీపీకి పాటలు పాడనంటూ వ్యాఖ్యలు చేసిన మంగ్లీకి… పార్టీకి చెందిన కీలక నేతగా అంత ప్రాధాన్యం ఇవ్వడం అవసరమా? అంటూ పార్టీ శ్రేణులు మంత్రిని ప్రశ్నించాయి.
అసరవిల్లి రథ సప్తమి వేడుకలు ముగిసిన తర్వాత అటు కేంద్ర మంత్రి, ఇటు పార్టీ శ్రేణులు అందరూ ఈ విషయాన్ని మరిచిపోయారు. మంగ్లీ కూడా ఈ విషయం గురించి పెద్దగా ప్రస్తావించలేదు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు తన పాటకు రాజకీయ ముద్ర ఆపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
తన పాటకు రాజకీయ ముద్రతో తాను చాలా అవకాశాలను కోల్పోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను కేవలం వైసీపీకి మాత్రమే పాటలు పాడలేదని…బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కూడా పాటలు పాడానని తెలిపింది. ఇప్పటికనా తన జీవనోపాధిని దెబ్బ తీసేలా… తన పాటకు రాజకీయ రంగు పులమొద్దని ఆమె వేడుకుంది.