పిల్లలను చివరిసారి చూడాలన్న తల్లి తండ్రుల కోరికను నెరవేర్చిన లోకేష్!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దేనిపై అయినా దృష్టి పెడితే… అది పూర్తి అయ్యే దాకా వదిలిపెట్టరు. అది రాజకీయం అయినా కావచ్చు. లేదంటే సంక్షేమ కార్యక్రమం అయినా కావచ్చు. చివరకు ఎవరికైనా చేయూత అందించే విషయం అయినా కావచ్చు.

ఈ విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా లోకేశ్ వెనుకంజ వేయరనే చెప్పాలి. అలా సాగుతున్న లోకేశ్ చొరవ కారణంగా ఎక్కడో విదేశాల్లో చనిపోయిన ఏపీకి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు దాదాపుగా 15 రోజుల తర్వాత వారి స్వస్థలాలకు చేరాయి.

గుంటూరు జిల్లాకు చెందిన చెరుకూరి సురేశ్, చెట్టూరి భార్గవ్ లు కొంతకాలం క్రితం విద్యాభ్యాసం నిమిత్తం ఐర్లాండ్ వెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 1న జరిగిన రోడ్డు ప్రమాదంలో వారిద్దరూ చనిపోయారు. ఈ విషయంపై ఐర్లాండ్ లోని తెలుగు సమాజం వేగంగానే స్పందించింది.

బాధిత కుటుంబాలకు సమాచారం చేరవేయడతో పాటుగా మృతదేహాలకు జరగాల్సిన తదనంతర కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. అంతేకాకుండా మృతదేహాలను వారి స్వస్థలాలకు చేరవేసేందుకు అవసరమైన నిధుల సమీకరణను కూడా మొదలుపెట్టింది.

అయితే అమెరికాలో మాదిరిగా ఐర్లాండ్ లో తెలుగు జనం అంత ఎక్కువగా లేరు కదా. నిధుల సమీకరణ కష్టంగా మారింది. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన ఐర్లాండ్ తెలుగు సమాజం… ఈ విషయాన్ని నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లింది. బాధితుల మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చేందుకు సహకరించాలని ఆయనను కోరింది.

ఈ దిశగా సురేశ్, భార్గవ్ ఇద్దరూ చనిపోయిన రోజే సమాచారం అందుకున్న లోకేశ్… తన యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. అక్కడి ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యేందుకు కొంత సమయ పట్టింది. చివరకు శనివారం సురేశ్, భార్గవ్ మృతదేహాలు వారి స్వస్థలాలకు చేరాయి. ఈ విషయాన్ని లోకేశ్ టీం స్వయంగా ప్రకటించింది.