హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఇటు రాజకీయాలలో..అటు సినిమా షూటింగులలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రం క్రమం తప్పకుండా పాల్గొంటారు. క్యాన్సర్ బాధితుల కోసం తన తండ్రి నందమూరి తారకరామారావు ప్రారంభించిన ఆ ఆసుపత్రిని బాలకృష్ణ అభివృద్ధి చేశారు.
ఒక్కొక్క విభాగాన్ని విస్తరించుకుంటూ అంతర్జాతీయ వైద్య సేవలను పేదలకు, సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు. ఈ క్రమంలోనే ఈ రోజు హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ వార్డు, పీడియాట్రిక్ ఐసీయూను బాలకృష్న ప్రారంభించారు. క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే కచ్చితంగా కోలుకుంటారని ఆయన అన్నారు.
క్యాన్సర్‌తో ఎంతోమంది బాధపడుతున్నారని, ఇప్పటివరకు 200 మంది చిన్నారులకు బోన్ మార్పిడి చేశామని చెప్పారు. ఆర్థిక స్థోమత లేని వారికి క్యాన్సర్ వైద్యం అందించడమే తమ లక్ష్యం అని అన్నారు. క్యాన్సర్ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు.
ఆసుపత్రి విస్తరణలో భాగంగా అమరావతిలోని తుళ్లూరులో మరో 8 నెలల్లో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభిస్తామని బాలకృష్ణ తెలిపారు. అమరావతిలో బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ 15 ఎకరాలను కేటాయించింది. ఆసుపత్రి నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణతోపాటు సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ పరిశీలించారు.
ఫేజ్-1లో 300 పడకలతో బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ను తుళ్లూరులో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని 1000 పడకలకు విస్తరించే యోచనలో ఉన్నారు. ఈ ప్రాంతంలో నిర్మాణానికి అడ్డుగా ఉన్న హెటీ విద్యుత్ లైన్ల తొలగింపు పూర్తి కాగానే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.