కూటమి ప్రభుత్వంలో నాయకులు తప్పు చేయరాదని.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురారాదని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం తమ దూకుడు తగ్గించుకోవడం లేదు.
పదే పదే తప్పులు చేస్తూనే ఉన్నారు. దీంతో అలాంటివారిని చూసీ చూడనట్టు వదిలేసిన వైసీపీ ప్రభుత్వం మాదిరిగా చంద్రబాబు వదిలేయడం లేదు. స్వయంగా వారికి ఫోన్లు చేసి హెచ్చరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజాగా వివాదాల సుడిలో చిక్కుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఫోన్లు చేసి మరీ హెచ్చరించా రు. “మీ తీరు మారాలి. లేక పోతే.. ఇబ్బందుల్లో పడతారు. జాగ్రత్త“ అని ముక్కుసూటిగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఇతర నాయకులు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకునే పరిస్థితి వస్తుందని.. అప్పుడు మొత్తం పొల్యూట్ అయిపోతుందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపై జాగ్రత్తగా ఉండకపోతే.. క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందేశం మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా చేరాలని చంద్రబాబు పేర్కొన్నారు.
ఎవరా ఇద్దరు?
కొలిక పూడి శ్రీనివాసరావు: ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈయన తిరువూరు ఎమ్మెల్యేగా తొలిసారి విజయం దక్కించుకున్నారు. విద్యాధికుడు, ఆలోచనా పరుడు కావడంతో చంద్రబాబు ఆయనకు స్థానికేతరుడు అయినా.. తిరువూరు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. కానీ, ఆయన అడుగు పెట్టిన నాటి నుంచి వివాదాలకు సెంట్రిక్‌గానే ఉన్నారు.
అనేక సార్లు పార్టీ క్రమ శిక్షణ సంఘం హెచ్చరించినా మార్పు రాలేదు. తాజాగా సొంత పార్టీ కార్యకర్తపైనే బూతులతో విరుచుకుపడ్డారు. దీంతో సదరు కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా బాబు హెచ్చరించారు.
చింతమనేని ప్రభాకర్ చౌదరి: దెందులూరు ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు చింతమనేనిపైనా చంద్ర బాబు నిప్పులు చెరిగారు. సీనియర్ అయి ఉండి.. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ క్లాస్ ఇచ్చారు. వైసీపీ నాయకుడు అబ్బయ్య చౌదరి కారుడ్రైవర్‌పై చింతమనేని దూషణలు దిగిన విషయం తెలిసిందే.
దీనికి సంంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయింది. దీనిపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చింతమనేనిని గురువారమే హెచ్చరించిన చంద్రబాబు.. తాజాగా మరోసారి ఫోన్ చేసి హెచ్చరించడం గమనార్హం.