తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కుల గణన తర్వాత.. ముఖ్యమంత్రి స్థానంలో బీసీల కు అవకాశం దక్కుతుందని.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతిపక్ష నేతలు కొందరు చేస్తున్న అంతర్గత ప్రచారంపై ఆయన పరోక్షంగా స్పందించారు.
“నేను ఈ రాష్ట్రానికి… కాంగ్రెస్ తరఫున చిట్ట చివరి ముఖ్యమంత్రి అయినా ఫర్వాలేదు. కానీ, కులగణన మాత్రం ప్రాధాన్యం పొందితే చాలు. తద్వారా.. బీసీలకు కొన్ని దశాబ్దాలుగా దక్కని మేలు జరుగుతుంది“ అని రేవంత్ వ్యాఖ్యా నించారు. కుల గణన ద్వారా బీసీలకు పట్టం కడుతున్నామని.. ఆయన అన్నారు.
కులగణన సర్వే.. తన అభిమతమే కాదని.. కాంగ్రెస్ అగ్రనాయకుడు.. తమ నేత రాహుల్ గాంధీ ఆశయం కూడా ఇదేనని రేవంత్ రెడ్డి చెప్పారు. అంతేకాదు.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే.. దేశవ్యాప్తంగా కూడా కులగణను చేపట్టి ఉండేవారమని చెప్పారు. అయినప్పటికీ.. రాహుల్‌గాంధీ దిశానిర్దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణను చేపట్టినట్టు తెలిపారు.
ఈ విషయంలో కొందరు లేనిపోని ప్రచారం చేస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. కుల గణనకు సహకరించరని వారికి రాష్ట్రంలో ఉండే అర్హత లేదన్నారు. “ప్రతిపక్షాలు ఈ విషయంపై ఆలోచన చేయాలి. కులగణన అనేది తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక. దీనిలో పాల్గొనని వారు.. రాష్ట్రంలో ఉండేందుకు అర్హులు ఎలా అవుతారు?“ మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
బీసీలకు పట్టం కడతారా?
కాగా.. రేవంత్‌రెడ్డి చేసిన చిట్టచివరి ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కుల గణనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో అసెంబ్లీలోనూ తీర్మానం చేశారు. దీనికి కేంద్రం ఆమోద ముద్ర వేస్తే.. అమలు కూడా కానుంది. ఈ నేపథ్యంలోనే బీసీలకు ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందన్న ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా.. దీనికి దన్నుగా మారాయి.
అంటే.. బీసీలు ఎక్కువగా ఉన్నందున.. వారికే ఈ సీటు దక్కినా.. తనకు ఇబ్బంది లేదన్న చర్చకు రేవంత్ తెరదీయడం గమనార్హం. ప్రస్తుతం మరో మూడు సంవత్సరాలకు పైగానే.. కాంగ్రెస్ పాలనకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో బీసీ నాయకుడికి ముఖ్యమంత్రిపీఠం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టుగా విశ్లేషణలు సాగుతున్నాయి.
గతంలో ఎస్సీలకు సీఎం సీటు ఇస్తానన్న కేసీఆర్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. ఇప్పుడు నేరుగా బీసీలకు సీఎం సీటు ఇస్తామని చెప్పకపోయినా.. రేవంత్ వ్యాఖ్యల అంతరార్థం ఇదే కావొచ్చన్నది పరిశీలకుల మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.