జ‌గ‌న్ నోట‌… న్యాయం-నీతులు: నెటిజ‌న్ల టాక్ ఇదే!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ తాజాగా మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టుపై స్పందించారు. కోర్టుల‌పై విశ్వాసం లేకుండా.. కోర్టు ప‌రిధిలో ఉన్న కేసుల్లోనూ..త‌మ నాయ‌కుల‌ను అరెస్టు చేస్తున్నారంటూ ఆయ‌న కూట‌మి స‌ర్కారుపై నిప్పులు చెరిగారు.

వంశీ అరెస్టును ఖండిస్తున్న‌ట్టుచెప్పిన జ‌గ‌న్‌.. న్యాయం అంటే ఇదేనా? అని ప్ర‌శ్నించారు. న్యాయ బ‌ద్ధంగా ధ‌ర్మ‌బ‌ద్ధంగా పాల‌న చేస్తామ‌ని చెప్పిన ప్ర‌మాణం ఏమైంద‌ని సీఎం చంద్ర‌బాబును ఉద్దేశించి నిల‌దీశారు. త‌మ పార్టీ నాయ‌కుల‌ను అక్ర‌మంగా, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. `అధికారం ఉంద‌ని అహంకారంతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు“ అని జ‌గ‌న్ నిప్పులు చెరిగారు. గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై కేసు విష‌యంలో టీడీపీ నేత‌లు వ‌త్తిడి తెచ్చి త‌ప్పుడు కేసులు పెట్టించార‌ని.. సాక్షాత్తూ.. పార్టీ కార్య‌క‌ర్తే న్యాయ‌మూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చాడ‌ని, కానీ, ఇదే కేసులో వంశీని అరెస్టు చేశార‌ని జ‌గ‌న్ చెప్పారు.

త‌మ త‌ప్పులు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయ‌ని భావించి.. వాటిని క‌ప్పిపుచ్చుకునేందుకు త‌మ నాయ‌కుల‌పై అభాండాలు వేస్తూ.. అక్ర‌మంగా అరెస్టులు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇన్ని దుర్మార్గాల‌కూ.. కేంద్రం చంద్ర‌బాబేన‌ని దుయ్య‌బ‌ట్టారు.

“సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడిని వేధించడం ఎంతవరకు కరెక్టు?“ అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? కక్షలు తీర్చుకోవడానికి ఇన్నిరకాలుగా వ్యవస్థలను వాడుకుని దుర్మార్గాలు చేస్తారా? అని నిల‌దీశారు.

ప్ర‌స్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు ప‌రిధిలో ఉంద‌ని, అయినా.. పోలీసులు రెచ్చిపోతున్నార‌ని వ్యాఖ్యానించారు. అధికారం ఉంద‌ని.. అహంకారంతో త‌ప్పుడు కేసులు పెడుతున్నార‌ని అన్నారు. అయినా.. తాము ధైర్యంగా ఈ కేసుల‌ను ఎదుర్కొంటామ‌ని జ‌గ‌న్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

కాగా.. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు ఫైర‌య్యారు. వైసీపీ హ‌యాంలో డాక్ట‌ర్ సుధాక‌ర్ కేసు కూడా కోర్టు విచార‌ణ‌లో ఉండ‌గానే.. ఆయ‌న‌ను న‌డిరోడ్డుపై చేతులు కాళ్లు క‌ట్టేసిన‌ప్పుడు.. ఈ కోర్టులు, ఈ న్యాయాలు క‌నిపించ‌లేదా? అని ఒక‌రు ప్ర‌శ్నించారు. మ‌రొక‌రు.. ద‌ళితుల‌పై దాడులు చేసి.. మ‌రియ‌మ్మ అనే మ‌హిళ‌ను దారుణంగా చంపిన‌ప్పుడు.. ఈ ద‌ళిత ప్రేమ ఏమైంద‌ని అప్పుడు అధికారంలో ఉన్నందున మీది అధికార అహంకారం కాదా? అని నిల‌దీశారు.

కోర్టులు- న్యాయాలు-చ‌ట్టాలు అంటే… విలువ పోయింది వైసీపీ హ‌యాంలోనేనని మెజారిటీ నెటిజ‌న్లు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు రంగులు వేయొద్ద‌న్న న్యాయ‌మూర్తుల‌ను దూషించిన వారువైసీపీ వారు కాదా? అని నిల‌దీశారు.