వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు పొలిటికల్ హార్ట్ వంటి పులివెందులపై టీడీపీ నాయకులు కన్నేశారు. ఆయన సొంత నియోజకవర్గంలో వైసీపీకి షాకిచ్చే పరిణామాలను తెరమీదికి తెచ్చారు. రాష్ట్రంలో 12 మునిసిపాలిటీలను కైవసం చేసుకున్న టీడీపీ కూటమి.. ఇప్పుడు కీలకమైన పులివెందులపైనా దృష్టి పెట్టడం గమనార్హం. పులివెందుల అంటేనే వైసీపీకి, వైఎస్ కుటుంబానికి కూడా అత్యంత కీలకమన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడ ఓడిపోయినా.. పార్టీ ఇక్కడ విజయం దక్కించుకుంది.
అయితే.. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కాబట్టి.. ఇప్పుడు పులివెందులలోనూ ఇలాంటి రాజకీయాలే తెరమీదికి వస్తున్నాయి. గతంలో కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ నాయకులు ఎలా అయితే.. ప్రయత్నించారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే రేంజ్‌లో స్థానిక టీడీపీ నాయకులు.. ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక్కొక్క స్టెప్పు వేస్తూ.. పులివెందులలో టీడీపీ జెండా ఎగిరేలా చేయాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుతం పులివెందుల మునిసిపాలిటీని కైవసం చేసుకునేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తు న్నారు. వైసీపీకి కంచుకోటే అయినప్పటికీ.. బలమైన ప్రయత్నమే చేస్తున్నారు. ఈ క్రమంలో మునిసిపాలిటీ లో టీడీపీ జెండా ఎగిరేలా కీలక నాయకులు మాస్టర్ ప్లాన్ వేశారు. మొత్తం వార్డుల వారీగా నాయకులను తమవైపు తిప్పుకొంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ కౌన్సిలర్ షాహిదా తాజాగా పార్టీలో చేరిపోయారు. ఈయనకు బలమైన కేడర్ ఉంది. దీంతో ఆయన వెంట 30 మందికిపైగా ముస్లిం మైనారిటీ నాయకులు కూడా టీడీపీలో చేరారు.
అయితే.. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. వచ్చే నెల రోజుల్లో పూర్తిగా మునిసిపాలిటీని సొంతం చేసుకునే దిశగా అయితే.. టీడీపీ అడుగులు పడుతున్నాయి. ఈ ఆపరేషన్ సక్సెస్ చేయాలన్న లక్ష్యంతో మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌రవి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్‌పై పోటీ చేసి ఓడిన రవి.. ఇప్పుడు తన పట్టు నిలుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పులివెందుల మునిసిపాలిటీలో టీడీపీ జెండా ఎగిరేలా ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం.