జగన్ తెగింపుపై చంద్రబాబు కామెంట్స్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, కల్తీ జరగలేదని వైసీపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతూ వస్తున్నారు. కానీ, కల్తీ జరిగిందని ఆధారాలతో సహా నిరూపిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంలో నలుగురిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడంతో వైసీపీ నేతలకు షాక్ తగిలింది. ఈ క్రమంలోనే ఆ ఇష్యూపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.

శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడుతున్నారని గతంలో తాము చెప్పిన విషయం ఇప్పుడు సీబీఐ అరెస్టులతో తేటతెల్లమైందని చంద్రబాబు చెప్పారు. కల్తీ నెయ్యి గురించి తమ వ్యాఖ్యలను జగన్ తప్పుబట్టారని గుర్తు చేశారు. కానీ, లడ్డూ తయారీలో వాడే నెయ్యి సరఫరాకు వైసీపీ హయాంలో టెండర్లు పిలిచారని, కొందరికి అనుకూలంగా నిబంధనలకు సడలించారని చంద్రబాబు ఆరోపించారు. ఆ అక్రమాలు బయటపడ్డ తర్వాత అయినా వైసీపీ వైఖరిలో మార్పు రాలేదని, నెయ్యి సరఫరాలో అక్రమాలు లేవని జగన్ సర్కార్ దుష్ప్రచారానికి ప్రయత్నించిందని ఆరోపించారు.

తాను చెప్పిందే నిజమని నిరూపించేందుకు జగన్ ఎంతకైనా తెగిస్తారని, జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయపడ్డారు. బాబాయ్ హత్యను, కోడికత్తి డ్రామాను, గులకరాయి డ్రామాను కూడా టీడీపీపైకి నెట్టివేసేందుకు ప్రయత్నించారని, కాబట్టి జగన్ నాటకాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులతో జరిగిన సమావేశంలో చంద్రబాబు అన్నారు.

కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి 8 నెలలవుతోందని, కూటమిపై విశ్వాసంతో ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో సవాళ్లు సహజమని, కానీ, ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వనరులు అవే అని, అధికారులూ వాళ్లేనని, కానీ, కార్యదక్షత వల్లే అభివృద్ధిలో వ్యత్యాసం వస్తుందని చెప్పారు.

ఇక, ఎట్టి పరిస్థితుల్లో ఆర్టికల్ 1/70 చట్టాన్ని తొలగించే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడతామని హామీనిచ్చారు. ఆ చట్టం తొలగిస్తున్నామన్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని గిరిజనులను కోరారు. అంతేకాదు, గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తామని చెప్పారు.