కేంద్ర చట్టాన్ని సవాలు చేసిన పంజాబ్ ప్రభుత్వం..రాజీనామాకు రెడీ

అవును కేంద్రప్రభుత్వం ఇటీవలే అమల్లోకి తెచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాన్ని పంజాబ్ ప్రభుత్వం సవాలు చేసింది. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసేది లేదని నిండుసభలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పష్టంగా ప్రకటించారు. చట్టాన్ని అమలు చేసే విషయంలో కేంద్రం తమ ప్రభుత్వాన్ని రద్దు చేసినా పర్వాలేదు కానీ తమ రాష్ట్రంలో మాత్రం రైతు వ్యతిరేక చట్టాన్ని మాత్రం అమలు చేసేది లేదని తేల్చిచెప్పారు. సుమారు నెల రోజుల క్రితం కేంద్రప్రభుత్వం నూతన వ్యవసాయ సంస్కరణ చట్టాన్ని తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చట్టంపై ఉత్తరాధిలోని చాలా రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి.

వ్యవసాయ సంస్కరణల చట్టం ముసాయిదాను కేంద్రం విడుదల చేసిన దగ్గర నుండి పంజాబ్ రైతులు వ్యతిరేకిస్తున్నారు. కొత్త చట్టం వల్ల తమకు అన్యాయం జరుగుతుందంటూ రైతులు ఆందోళన మొదలుపెట్టారు. చట్టం చేసే ముందు తమతో కేంద్రం మాట్లాడాలంటూ రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే వీళ్ళ డిమాండ్ ను కేంద్రం పట్టించుకోలేదు. దాంతో పంజాబ్ లోని రైతు సంఘాలంతా ఏకమై కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలుపెట్టాయి. ఇదే విధంగా మహారాష్ట్ర, హర్యానా, రాజస్ధాన్ తో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా రైతల ఆందోళనలు మొదలయ్యాయి.

ఇటువంటి నేపధ్యంలోనే రైతులతో మాట్లాడుతానని చెప్పి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ పంజాబ్ లోని రైతు సంఘాల ప్రతినిధులకు కేంద్రం కబురుపెట్టింది. పంజాబ్ నుండి రైతు సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే కేంద్రమంత్రి మాత్రం అడ్రస్ లేరు. పైగా మంత్రి బదులు వ్యవసాయ శాఖ కార్యదర్శి హాజరయ్యారు. దాంతో సమావేశానికి పిలిచి తమను అవమానించినట్లు రైతులు మండిపోయారు. దాంతో తమ రాష్ట్రానికి తిరిగివెళ్ళిపోయిన తర్వాత ఆందోళనలను మరింతగా పెంచారు.

అసలే పంజాబ్ అంటే వ్యవసాయ రాష్ట్రమన్న విషయం అందరికీ తెలిసిందే. దానికితోడు పార్టీలకు అతీతంగా రైతాంగం అంతా ఏకమైతే ఇక చెప్పేదేముంది. ఇప్పుడూ అదే జరిగింది. రైతుల ఆందోళనల తాలూకు సెగ అసెంబ్లీ సమావేశాలను గట్టిగానే తగిలింది. దాంతో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాట్లాడుతూ తన రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కేంద్రం చట్టాన్ని ఎట్టి పరిస్ధితుల్లోను అమలు చేసేది లేదన్నారు. చట్టాన్ని అమలు చేసే విషయంలో పంజాబ్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కేంద్రం నిర్ణయిస్తే అంతకన్నా ముందే తాను రాజీనామా చేసేస్తానని స్పష్టంగా ప్రకటించారు. మరి అమరీందర్ హెచ్చరిక తర్వాత కేంద్రం ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.