బాబు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి మంత్రం.. 2029 అప్పుడే టార్గెట్ ..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు పాల‌న మ‌ధ్య‌త‌ర‌గ‌తికి ప‌రిమితం అవుతోందా? ఆయ‌న చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు అన్నీ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేలానే ఉన్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కృత్రిమ మేథ‌(ఏఐ) నుంచి వాట్సాప్ పాల‌న వ‌ర‌కు, డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త నుంచి డేటా వ‌ర‌కు.. ఇలా ఏ విష‌యాన్ని తీసుకున్నా.. మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించే చంద్ర‌బాబు అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపి స్తోంద‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ఎందుకిలా..?
ప్ర‌స్తుతం రాష్ట్రంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం.. 45 శాతానికి పైగానే ఉంది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి అంటే.. నెల‌కు 25-50 వేల రూపాయ‌ల వేతనం.. ఆపైన మరో 20 నుంచి 40 వేల మ‌ధ్య‌ అందుకునే వారంతామ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గా లే. వీరంతా అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. అదేస‌మ‌యంలో పాల‌న‌ను కూడా డిజిట‌లీక‌ర‌ణ‌ను కోరుకుంటున్నారు. ఇంట్లో కూర్చునో.. ఆఫీసుల్లో కూర్చునో సొంత‌ ప‌నులు చ‌క్క‌బెట్టుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. వీరిని చంద్ర‌బాబు టార్గెట్ చేశారు.

అంతేకాదు.. వ‌చ్చే రెండేళ్ల‌లో వేత‌నాలు మ‌రింత పెర‌గ‌నున్నాయి. దీంతో మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల్లో వేత‌నాలు సుమారు రూ.ల‌క్ష వ‌ర‌కు చేరే అవ‌కాశం ఉంది. ఇక‌, భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ ఉద్యోగులు అయితే.. అది ప్రైవేటు కావొచ్చు.. ప్ర‌భుత్వం కావొచ్చు.. వారి ఆదాయాలు మ‌రింత పెరుగుతాయి. దీంతో వీరి సంఖ్య కూడా.. పెరుగుతుంది. అప్పుడు ఏకంగా మ‌ధ్య‌త‌ర‌గతి ప్ర‌జ‌లు 60 శాతానికి పైగా చేరే అవ‌కాశం ఉంటుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

ఈ పరిణామాల‌ను ముందుగానే అంచ‌నా వేసిన చంద్ర‌బాబు మ‌ధ్య‌త‌ర‌గ‌తిని మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఫ‌లితంగా ఉచితాల క‌న్నా.. కూడా అభివృద్ధిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం సులువు అవుతుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే విజ‌న్ 2047, డిజిట‌ల్ పాల‌న‌, వాట్సాప్ పాల‌న‌, డ్రోన్లు, ఏఐ అంటూ.. డిజిటలీక‌ర‌ణ దిశ‌గా ఆయ‌న అడుగులు అడుగులు వేస్తున్నార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.