బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన నిప్పులు చెరిగారు. 14 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నార ని.. కానీ, ఆయన పాలన అంతా.. సొంత కుటుంబం కోసమే అన్నట్టుగా ఉందని వ్యాక్యానించారు. సొంత కుటుంబానికి ప్రజల ఆస్తులు దోచిపెడుతున్నారని అన్నారు. అల్లుడి కోసం లగచర్ల భూములు గుండు గుత్తగా రాసిచ్చేశారని ఆరోపించారు.
“లగచర్ల భూములు లాక్కుని అల్లుడికి కట్నం కింద రాసిచ్చేశాడు. 14 నెలలుగా తన సొంత కుటుంబం కోసం.. పాలన చేస్తున్నాడు“ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దమ్ముంటే.. కొడంగల్ నియోజకవర్గానికి రాజీనామా చేయాలని సవాల్ రువ్వారు. తమ అభ్యర్థి నరేంద్ర రెడ్డిని నిలబెడతామని.. 50 వేల ఓట్ల మెజారిటీతో ప్రజలే నరేంద్రరెడ్డిని గెలిపించుకుంటారని వ్యాఖ్యానించారు. ఒక వేళ ఒక్క ఓటు తక్కువ వచ్చినా.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ రువ్వారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు జరిగింది మేలు కాదని.. బూడిదని కేటీఆర్ దుయ్యబట్టారు. ఎక్కడికక్కడ పందికొక్కుల్లా కాంగ్రెస్ నేతలు దోచుకుతింటున్నారని.. భూముల ఆక్రమణలు పెరిగిపోయాయని వ్యాఖ్యా నించారు. కేవలం ప్రతిపక్ష నేతలు.. కొందరు సెలబ్రిటీలను మచ్చిక చేసుకునేందుకు.. భయ పెట్టి పాలన చేసేందుకు రేవంత్ హైడ్రా అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంలోతమకు ఎలాంటి భయం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాగా.. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన పూజారి రంగరాజన్‌పై జరిగిన దుండగుల దాడిని కేటీఆర్ ఖండించిన విషయం తెలిసిందే. అయితే.. సోమవారం ఆయనను స్వయంగా కలిసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌పై విమర్శల వర్షం కురిపించారు. రాజీనామా చేయాలంటూ సవాల్ రువ్వారు.