క్షేత్రస్ధాయిలో పరిస్దితులను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఈనెల 28వ తేదీ నుండి వచ్చేనెల 10వ తేదీలోగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో అనేక కూటములు, పార్టీలు పోటి పడుతున్నాయి. 243 అసెంబ్లీ సీట్లలో విజయం కోసం ఎన్ని కూటములు, పార్టీలు పోటి పడుతున్నా ప్రధానంగా అధికారంలో ఉన్న ఎన్డీఏ, ప్రధాన ప్రతిపక్షమైన యూపీఏ కూటమి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అందరు అంచనాలు వేస్తున్నారు.
ఈ నేపధ్యంలో లోక్ నీతి-సిఎస్ డిఎస్ మీడియా, సర్వే సంస్ధలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేఫలితాలు కాస్త ఆసక్తిగా మారింది. పై సంస్ధలు నిర్వహించిన సర్వేని ఈనెల 10-17 తేదీల మధ్య జరిగింది. బీహార్లో ఎవరైనా అధికారంలోకి రావాలంటే కనీసం 122 సీట్లు రావాలన్న విషయం అందరికీ తెలిసిందే. పై సంస్దలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో ఎన్డీఏ కూటమి వైపే ఓటర్ల మొగ్గున్నట్లు అర్ధమవుతోంది. ఎన్డీఏ కూటమికి 133-143 సీట్ల మధ్య వస్తుందని అంచనా. అలాగే యూపీఏ కూటమికి 88-98 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఎల్జేపీకి 2-6 సీట్లు, ఇతరులు 6-10 సీట్లు గెలుచుకుంటారని సర్వేలో అర్ధమవుతోంది.
సర్వేలో ద్వారా బయటపడిన విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పరిపాలనపై 62 శాతం మంది సంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. ఇదే సమయంలో కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వం పట్ల 61 శాతంమంది సానుకూలంగా ఉన్నట్లు స్పష్టమైంది. అంటే ఇది ప్రీ పోల్ సర్వేనే అయినా కచ్చితత్వాన్ని మాత్రం చెప్పేందుకు లేదు. ఎందుకంటే గతంలో చాలాసార్లు సర్వే అంచనాలు తప్పయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
కాకపోతే బీహార్లో సానుకూలమైన అంశం ఏమిటంటే నితీష్ కుమార్ పై అవినీతి ఆరోపణలు ఎక్కడా లేకపోవటమే. ఆర్జేడీ పరిపాలన అంటేనే అటవిక పాలన అన్న విషయం జనాల్లో ముద్రపడిపోయింది. ఆ ముద్ర నుండి నితీష్ రాష్ట్రాన్ని బయటకు తీసుకొస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో పరుగులు పెట్టిస్తున్నారు. ఈ కారణంగానే పదేళ్ళుగా అధికారంలో ఉన్న నితీష్ కు అవినీతి మరకలు అంటలేదు. ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే హ్యాట్సాఫ్ టు నితీష్ అనే చెప్పాలి. మరి ఓటర్ తీర్పు ఎలాగుంటుందో చూడాల్సిందే.