‘చిలుకూరు దాడి’ కుట్ర కోణం పెద్దదే!

హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఫై జరిగిన దాడి వెనుక పెద్ద కుట్ర కోణం ఉందన్న విషయం బయటపడింది. రామరాజ్యం స్థాపన పేరిట బయలుదేరిన ఓ వ్యక్తి… ఈ దాడికి కారణంగా నిలుస్తున్న… అతడి ఉద్దేశ్యం మాత్రం దారుణమైనదన్న వాదనలు వినిపిస్తున్నాయి. రామరాజ్య స్థాపన ఉద్దేశ్యం మంచిదే అయినా.. దానిని అతడు ముందుకు తీసుకువెళుతున్న వైనం భయకంపితులను చేస్తోందని చెప్పక తప్పదు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఘటన జరిగిన తెలంగాణలోనే కాకుండా… ఏపీలోనూ కలకలం రేపుతోంది.

ఏపీలోని అనపర్తికి చెందిన వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి రామరాజ్య స్థాపన కోసం ఓ పెద్ద క్రతువుకు తెర తీశారు. అందులో భాగంగా రెండు రాష్ట్రాల్లోని పలు ఆలయాలకు వెళ్లిన ఆయన… రామరాజ్య స్థాపనకు సహకరించాలని.. అందుకు తమ వంతుగా ఆలయ పరిధిలోని సేవకులను రామరాజ్య స్థాపనలో భాగస్వామ్యం చేయాలని కోరుతున్నారు. ఇందుకు చాలా మంది ఒప్పుకుంటున్నట్టుగా సమాచారం. అయితే.. హిందూ ధర్మ పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు విరుద్ధమని భావించిన రంగరాజన్.. వీర రాఘవ రెడ్డి ప్రతిపాదనకు అంగీకరించలేదు. ఈ కారణంగానే రంగరాజన్ ఫై రాఘవ రెడ్డి తన అనుచరులతో కలిసి దాడి చేసినట్టు తెలుస్తోంది. దీనిపై రంగరాజన్ తండ్రి… సౌందర్య రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రాఘవ రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే… ఇదే రీతిన పదోళ్ల క్రితమే రాఘవ రెడ్డి హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటుగా పలువురిపై దాడి చేశారట. ఈ మెరకు ఆయనపై నగర పోలీసులు గతంలోనే కేసులు కూడా నమోదు చేశారు. ఏపీలోని కోటప్పకొండ ఆలయాన్ని కూడా రాఘవ రెడ్డి ఇదే డిమాండ్తో సందర్శించారట. అంతేకాకుండా ఏపీలోని పలు ఆలయాలకు కూడా ఆయన ఇదే ప్లాన్ తో వెళ్లినట్టు సమాచారం. రామరాజ్య స్థాపన కోసం తన వెంట వచ్చే వారికి తాను వేతనాలు కూడా ఇస్తానని కూడా ఆయన చెప్పారట. ఈ లెక్కన రామరాజ్య స్థాపన కోసం రాఘవ రెడ్డి ఓ భారీ ప్లాన్ నే సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే… చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి ఫై దాడి చేయడంతో రాఘవ రెడ్డి ప్లాన్ మధ్యలోనే ఆగిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.