జగన్ నివాసం వద్ద ప్రమాదాలకు చెక్ పడినట్టే

వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద ఇటీవల ఒకే రోజు రెండు సార్లు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదాలకు సంబంధించి పలు రకాల భిన్న వాదనలు వినిపించాయి. ఎండు గడ్డిపై నిప్పు రవ్వ పడగా ప్రమాదం సంభవించిందని ఓ వాదన వినిపిస్తే.. కీలక పత్రాలను తగులబెట్టే క్రమంలో జగన్ అనుచర గణమే ఈ ప్రమాదానికి కారణమయ్యారన్న వాదనలూ వినిపించాయి. కారణం ఏదైనా… ఓ మాజీ సీఎం ఇంటి పరిసరాల్లో ఒకే రోజు రెండు పర్యాయాలు అగ్ని ప్రమాదం జరగడం ఒకింత ఆందోళనకారమే కదా. అందుకే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

జగన్ ఇల్లు, వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద అగ్ని ప్రమాదం జరిగిందని ఆ పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న మంగళగిరి పోలీసులు.. ఇప్పటికే దర్యాప్తు కూడా ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు… సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలంటూ వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు. అయితే.. ఈ నోటీసులకు వైసీపీ నుంచి పెద్దగా స్పందన రాలేదట. ప్రమాదంపై కంప్లైంట్ ఇచ్చిన వైసీపీ… సీసీటీవీ ఫుటేజీ ఇవ్వడానికి మాత్రం ఆసక్తి చూపని వైనంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాగైతే కాదని భావించిన పోలీసులు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

జగన్ నివాసం, వైసీపీ కేంద్ర కార్యాలయం ఉన్న పరిసరాలను పూర్తిగా కవర్ అయ్యేలా ఏకంగా 8 సీసీటీవీ లను మంగళగిరి పోలీసులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సదరు సీసీటీవీ లను నేరుగా మంగళగిరి పోలీస్ స్టేషన్ తో అనుసంధానించారు. అంటే.. జగన్ ఇల్లు , వైసీపీ కేంద్ర కార్యాలయాల పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా… అవన్నీ ఇట్టే మంగళగిరి పోలీస్ స్టేషన్ లో రికార్డ్ అయిపోతాయన్నమాట. అంటే.. జగన్ ఇల్లు, వైసీపీ కేంద్ర కార్యాలయాల వద్ద చీమ చిటుక్కుమన్నా మాసినఁగళగిరి పోలీసులకు ఇట్టె తెలిసిపోతుందన్న మాట. అంటే.. ఇకపై జగన్ ఇంటి వద్ద ఎలాంటి అనుమానాస్పద ప్రమాదాలకు తావు లేదన్న మాట. ఇకపై జగన్ తో పాటు వైసీపీ కేంద్ర కార్యాలయ ఇబ్బంది నిశ్చింతగా నిద్ర పోవచ్చన్నమాట.