జాతుల వైరం ఎఫెక్ట్.. మణిపూర్ సీఎం రాజీనామా

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ చాలా రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. రెండు జాతుల మధ్య నెలకొన్న వైరం ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. పదుల అంఖ్యలో ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. ఫలితంగా… మణిపూర్ లో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారుతో పాటుగా కేంద్రంలోని ఎన్డీయే సర్కారు కూడా తీవ్ర విమర్శలను ఎదుర్కోవ్బాల్సి వచ్చింది. మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోడీ కనీసం మాటమాత్రంగానైనా స్పందించలేదని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. అంతేకాకుండా రాష్ట్రంలోని బీజేపీ సర్కారు నిష్క్రియాపరత్వంగా వ్యవహరించిందని నిందలు మోపాయి. అయినా కూడా బీజేపీ గాని ఎన్డీయే గాని ఏమాత్రం స్పందించలేదు.

తాజాగా ఉరుము లేని పిడుగు మాదిరిగా ఆదివారం మణిపూర్ సీఎం గా వ్యవహరిస్తున్న బీజేపీ సీనియర్ నేత బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు ఢిల్లీ వెళ్లిన బీరేన్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మణిపూర్ లోని తాజా రాజకీయ పరిస్థితులపై అయన వారితో చర్చించారు. తదనంతరం మణిపూర్ తిరిగి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ అజయ్ భల్లాకు అందజేశారు. మణిపూర్ కు సీఎంగా పనిచేసే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి మంచి సహకారం అందిందని.. ఇకపైనా కేంద్రం నుంచి అదే సహకారం అందుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

మణిపూర్ లో జాతుల వైరం నెలకొన్న నేపథ్యంలో బీరేన్ సింగ్ తప్పనిసరిగా రాజీనామా చేస్తారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… బీజేపీ అత్యంత కీలకంగా భావించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో ఇలాంటి కీలక నిర్ణయాలు పార్టీకి నష్టం చేస్తాయని అధిష్టానం భావించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికలు ముగిసిన మరుక్షణమే మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్ తో బీజేపీ రాజీనామా చేయించినట్టుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీరేన్ సింగ్ రాజీనామాతో ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.