పులివెందుల సమస్యల పరిష్కారం కోసం… ఆ నియోజకవర్గ ప్రజలు ఇప్పటిదాకా వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లేవారు. అది కూడా జగన్ పులివెందులకు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ తరహా దృశ్యాలు కనిపించేవి. ఎందుకంటే… చాలా ఏళ్లుగా పులివెందుల ఎమ్మెల్యే గా జగన్ కొనసాగుతున్నారు కాబట్టి. జగన్ కు ముందు ఆయన తల్లి విజయమ్మ అంతకుముందు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే లుగా కొనసాగారు. ఫలితంగా పులివెందుల సమస్యలు వైఎస్ కుటుంబ సభ్యులను దయతో పోలేదు.
అయితే… ఇప్పుడు మొట్టమొదటి సారి పులివెందుల సమస్యలు ఓ టీడీపీ నేత వద్దకు చేరాయి. ఆ టీడీపీ నేత అడ్డాకు పులివెందుల సమస్యలు తీసుకెళ్లిన నేత కూడా టీడీపీకి చెందిన నేతనే అయినా… ఆయన కూడా పులివెందులకు చెందినవారే కావడం గమనార్హం. పులివెందుల సమస్య ఇప్పుడు టీడీపీ యువ నేత కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ వద్దకు చేరింది. ఆ సమస్యను ఆయన వద్దకు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీసుకెళ్లారు. అయినా.. సదరు సమస్య ఏమిటన్న విషయానికి వస్తే.. పులివెందులలో రోడ్ల సమస్యను పరిష్కరించాలని కేంద్ర మంత్రికి భూమిరెడ్డి విన్నవించారు.
ఈ పరిణామం నిజంగానే జగన్ అండ్ కో కు అవమానమేనని చెప్పాలి. ఎందుకంటే.. పులివెందుల ఎమ్మెల్యే గా జగన్ ఉండగా… కడప ఎంపీగా జగన్ సోదరుడు వై ఎస్ అవినాష్ రెడ్డి కొనసాగుతున్నారు. అంటే.. పులివెందులకు అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ.. రెండు పదవులు వైఎస్ ఫామిలీ చేతిలోనే ఉన్నాయి. అయినా కూడా పులివెందులలో ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా ఉన్న రోడ్ల సమస్యను పరిష్కరించాలని భూమిరెడ్డి నేరుగా కేంద్ర మంత్రి వద్దకు వెళ్లడం గమనార్హం. ఈ విషయం తెలిస్తే జగన్ ఎలా స్పందిస్తారోనన్న అంశం ఆసక్తి రేకెత్తిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates