కలసి ఉంటే కలదు సుఖం.. అన్నట్టుగా కూటమిగా ఢిల్లీలో నిలబడి ఉంటే.. ఇండియా కూటమి ఘన విజయం దక్కించుకునేది.. అనేందుకు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన ఓట్ల షేరు ఉదాహరణగా నిలుస్తోంది. దాదాపు 27 సంవత్సరాల తర్వా త.. బీజేపీ హస్తిన పీఠాన్ని కైవసం చేసుకుంది. 48 స్థానాల్లో విజయం దక్కించుకుని అధికారం చేపట్టింది. అయితే.. ఇదేసమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకే పరిమితమై… అధికారం కోల్పోయింది. ఇది పైకికనిపిస్తున్న వాస్తవం. కానీ, తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఓట్ల షేర్‌ను పరిశీలిస్తే.. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం 2 లక్షలు!
ఆశ్చర్యం కాదు.. గెలిచిన పార్టీ, ఓడిన పార్టీ మధ్య 2 లక్షల ఓట్లే తేడా ఉన్నాయి. అంటే..ఈ రెండు లక్షల ఓట్లు చీలిపోయాయి. ఇవి కనుక.. పదిలంగా ఉండి ఉంటే.. కేజ్రీవాల్ విజయం దక్కించుకునే వారు. మరోసారి ఢిల్లీ పగ్గాలు చేపట్టేవారు. కానీ, ఇక్కడే ఇండియా కూటమి చేతులు కలపని వైనంతో ఏకంగా 6 లక్షలకుపైగా ఓట్లు చీలిపోయాయి.
తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసీటు దక్కలేదు. కాంగ్రెస్‌కు జీరో! కానీ, ఓట్ల షేర్ విషయానికి వస్తే.. కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న లెక్కల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షలపై చిలుకు ఓట్లు వచ్చాయి.
అంటే.. ఇవి అచ్చంగా కూటమి ఓట్లు! ఆప్-కాంగ్రెస్‌లు కలిసి ఉంటే.. ఈ ఆరు లక్షల ఓట్లు కూడా.. కూటమికి పడేవి. తద్వారా.. ఢిల్లీ ఆప్ వశం అయ్యేది. కానీ, కలసి ఉండని ఫలితంగా ఓట్లు చీలి .. ఆప్ కుదేలైంది. మరోవైపు.. చిన్న చితకా పార్టీలు కూడా.. ఆప్ ఓటమికి కారణమయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం.. ఈ ఎన్నికల్లో 80 వేల ఓట్లను రాబట్టుకుంది. ఇక, యూపీకి చెందిన బీఎస్పీ.. 35 వేల ఓట్లను తెచ్చుకుంది. అదేవిధంగా ఇతర ప్రాంతీయ పక్షాలు కూడా.. 60 వేల ఓట్లపైచిలుకు చీల్చాయం. ఇవన్నీ.. కూడా ఇండియా కూటమికి దక్కే ఓట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. స్వల్ప ఓట్ల తేడాకు కలసి కట్టుగా ముందుకు వెళ్లకపోవడం.. పంతాలు, పట్టింపులకు పోవడం.. వంటివి కారణాలుగా చెబుతున్నారు.