రాజకీయాల్లో వైసీపీది సరికొత్త పంథా. ఎవరు అవునన్నా… ఎవరు కాదన్నా.. ఈ మాట అక్షర సత్యం. గడపగడపకు వైసీపీ కార్యక్రమం ఆ పార్టీకి ఎంతగా ఉపయోగపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఆ పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర వైసీపీకి ఏకంగా అధికారాన్ని కట్టబెట్టింది. ఎప్పుడైతే అధికారం చేతికి అందిందో… ఇక తమకు తిరుగే లేదన్నట్టుగా జగన్, ఆయన అనుచర వర్గం వ్యవహరించిన తీరు వైసీపీని గద్దె దించింది. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా ఆ పార్టీకి దక్కకుండా చేసింది.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు జగన్ తో పాటు వైసీపీ శ్రేణులను షాక్ కు గురి చేశాయి. జగన్ కు అయితే నోటా మాట రాలేదు. ఎదో కారణం చెప్పాలి కాబట్టి ఈవీఎం ల మీద నెపం వేసిన జగన్… ఓటమిని జీర్ణించుకునేందుకు చాలా సమయాన్నే తీసుకున్నారు. ఇప్పటికి కూడా జగన్ ఓటమి నుంచి తేరుకోలేదనే చెప్పాలి. అయితే.. ఎంతోకాలం దాక్కుని రాజకీయాలు చేయలేరు కదా. అందుకే ఓటమికి కారణాలను వెలికితీసిన జగన్… కార్యకర్తలను పట్టించుకోని కారణంగానే ఎన్నికల్లో ఓటమి తప్పలేదన్న నిజాన్ని గ్రహించారు. ఈ తప్పును సరిదిద్దుకునే క్రమంలో ఓ సరికొత్త కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు.
‘నా కార్యకర్తలు – నా కుటుంబం’ పేరిట జగన్ రూపుదిద్దిన కార్యక్రమాన్ని ఆ పార్టీ నేతలు తమ నియోజకవర్గాల్లో ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా.. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శనివారం తన పరిధిలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా.. పార్టీలో గతంలో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల కార్యకర్తలు ఒకింత ఇబ్బంది పడ్డారని ఆయన ఒప్పుకున్నారు. అయితే… ఇప్పుడు అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడేందుకే ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంతో పార్టీ శ్రేణుల్లో తమకు పార్టీ అండగా ఉంటుందన్న భరోసా నింపుతామని రాజా చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates