జగన్ ఫై చంద్రబాబు మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మొన్నటి దాకా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఓ రేంజిలో విరుచుకుపడేవారు. ఇక కొందరు టీడీపీ నేతలు కూడా జగన్ ఫై ఒంటికాలిపై లేచేవారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంరబాబునాయుడు మాత్రం… ఎప్పుడు జగన్ ను టార్గెట్ చేసినా.. వైసీపీ విధాన నిర్ణయాలపైనే మాట్లాడేవారు. ఇప్పుడు చంద్రబాబు కూడా జగన్ ఫై ర్యాగింగ్ కు పాల్పడినంత పని చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించేందుకు శనివారం మీడియా ముందుకు వచ్చిన సందర్బంగా జగన్ ఫై చంద్రబాబు తనదైన స్టయిల్లో వాగ్బాణాలు సంధించారు.

ప్రధాని నరేంద్ర మోడీఫై ఢిల్లీ ఓటర్లు విశ్వాసం ఉంచారని.. ఈ కారణంగానే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయం దక్కిందని చంద్రబాబు చెప్పారు. ఈ సందర్బంగా ఢిల్లీ లిక్కర్ స్కాం ను చంద్రబాబు ప్రస్తావించారు. లిక్కర్ స్కాం కు పాల్పడిన కారణంగానే ఆప్ ను ఢిల్లీ ప్రజలు తిరస్కరించారన్నారు. ఢిల్లీ లిక్కర్ తరహాలోనే ఏపీలో కూడా లిక్కర్ స్కాం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. ఏపీ లిక్కర్ స్కాం..ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే కూడా పెద్దదని కూడా ఆయన ఆరోపించారు. సంక్షేమ పథకాల అమలులో బటన్ నొక్కుడు ఏపీలో జగన్ ను… ఢిల్లీలో కేజ్రీవాల్ ను ఓడించాయని ఆయన అన్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓట్లు, సీట్లను చంద్రబాబు ప్రస్తావించారు. ఓ నేతకు ఎమ్మెల్యేగా గెలిచేంత మేర ఓట్లు వస్తే… ఆ నేతను ఎమ్మెల్యేనే అంటారని ఆయన అన్నారు. అదే సమయంలో..అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షానికి అవసరమైన మేర సీట్లు వస్తే… ఆ పార్టీలకు ఆ హోదా దానికదే దక్కుతుందని అన్నారు. అయినా… ప్రధాన ప్రతిపక్ష హోదా అడుక్కుంటే రాదనీ కూడా చంద్రబాబు అన్నారు. ఓట్లు, సీట్లు ఆధారంగానే ఆయా నేతలకు, పార్టీలకు హోదాలు దక్కుతాయని కూడా ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్నంతసేపు చంద్రబాబు ఎక్కడ కూడా జగన్ పేరును గాని, వైసీపీ పేరును గాని ప్రస్తావించకపోవడం గమనార్హం. అయితే.. ఈ వ్యాఖ్యలన్నీ ఆయన జగన్ ను టార్గెట్ చేసే అన్నారని చెప్పక తప్పదు.