న్యూటన్ లాతో లేడీ లీడర్ వార్నింగ్!

సోషల్ మీడియాలో శనివారం ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వైసీపీకి చెందిన మహిళా నేత, మాజీ మంత్రి, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజిని సదరు వీడియోలో తన రాజకీయ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇస్తున్నారు. రజిని వీడియోను బిట్లు బిట్లుగా కట్ చేసి అటు వైసీపీ యాక్టీవిస్తులు ఇటు రజిని అభిమానులు సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తున్నారు.

అయినా.. ఈ వీడియోల్లో అంతగా ఏముంది అంటారా.. ఓ లేడీ సింగం మాదిరిగా రజిని తన రాజకీయ ప్రత్యర్థి అయిన టీడీపీ సీనియర్ నేత, చిలకలూరి పేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. తనపై అక్రమ కేసులు పెడుతున్నారని… చివరకు తన కుటుంబ సభ్యులను కూడా వదలడం లేదని ఆమె వాపోతున్నారు. అధికారం అండ చూసుకుని అధికారులు కూడా అధికార పార్టీ నేతలు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

ఈ సందర్భంగా రజిని ప్రఖ్యాత శాస్త్రవేత్త న్యూటన్ ను గుర్తు చేసుకున్నారు. న్యూటన్ సిద్ధాంతాలను గుర్తు చేసిన రజిని… చర్యకు ప్రతి చర్య ఉంటుందన్న విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. అంతేకాకుండా సదరు ప్రతి చర్య తప్పనిసరిగా ఉంటుందని తెలిపారు. న్యూటన్ చెప్పినట్టుగా.. చర్య ఎంత బలంగా ఉంటుందో..ప్రతి చర్య అంతే బలంగా ఉంటుందన్నారు. అయితే… తన విషయంలో మాత్రం ప్రతిచర్య.. చర్య కంటే కూడా మరింత బలంగా ఉంటుందని ఓ రేంజిలో వార్నింగ్ ఇచ్చారు. రజిని వార్నింగ్ లతో కూడిన ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.