చంద్ర‌బాబు ‘ర్యాంకులు’.. కూట‌మి హ్యాపీయేనా.. ?

కూట‌మి స‌ర్కారు మంత్రి వ‌ర్గ ప‌నితీరుపై సీఎం చంద్ర‌బాబు మార్కులు వేసేశారు. మంత్రుల‌కు ర్యాంకు లు కూడా ప్ర‌క‌టించారు. అయితే.. ఈ ర్యాంకుల వ్య‌వ‌హారంకొన్నాళ్లుగా చ‌ర్చ‌కు వ‌చ్చినా.. ఊహించిన దానికి భిన్నంగా ఉండ‌డంతో అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌నే చెప్పాలి. వాస్త‌వానికి మంత్రి నారా లోకేష్‌, సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రులు నాదెండ్ల మ‌నోహ‌ర్‌, సత్య‌కుమార్‌, సంజీవ‌రెడ్డిగారి స‌విత, వంగ‌ల‌పూడి అనిత‌ వంటివారు ప్ర‌జ‌ల్లో దూకుడుగాఉన్నారు.

నిరంత‌రం ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. వారి వారి శాఖ‌ల విష‌యంలోనూ అప్ర‌మ‌త్తంగా ఉంటున్నా రు. లోకేష్ అయితే.. ప్ర‌జా ద‌ర్బార్ ద్వారా ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అయ్యారు. ప్ర‌స్తుతం టీడీపీ నిర్వ‌హి స్తున్న ప్ర‌జాద‌ర్బార్‌కు ఆయ‌నే ఆలంబ‌న‌. తొలుత త‌న నియోజ‌క‌వ‌ర్గం మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ ప్ర‌జ‌ల నుంచి అర్జీలు తీసుకునే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఆ త‌ర్వాతే.. పార్టీ ప్రారంభించింది. అనంత రం.. బీజేపీ దీనిని అందిపుచ్చుకుంది. ఇక‌, జ‌న‌సేన కూడా అప్ప‌ట్లోనే జ‌న వాణి పేరుతో కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది.

ఇక‌, ప్ర‌జ‌లు ఎలాంటి స‌మ‌స్య‌ను ఎప్పుడు త‌న దృష్టికి తెచ్చినా.. నారా లోకేష్ వెంట‌నే స్పందించ‌డం కూడా తెలిసిందే. గ‌ల్ఫ్‌లో చిక్కుకుపోయిన వారిని తీసుకురావ‌డంలోనూ.. విద్యార్థుల ఫీజులు, ప‌రీక్ష‌ల విష‌యంలో వెంట‌నే రియాక్ట్ కావ‌డంలోనూ ముందున్నారు. ప‌వ‌న్ కూడా అలానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. అనూహ్య‌మైన రీతిలో వీరు వెనుక‌బ‌డ్డారు. నారా లోకేష్ 8వ ర్యాంకుతోను, ప‌వ‌న్ క‌ల్యాణ్ 10వ ర్యాంకు, చంద్ర‌బాబు 6వ ర్యాంకుతోనూ స‌రిపుచ్చుకున్నారు.

అయితే.. ఈ ర్యాంకుల కేటాయింపుపై వ్య‌క్తిగ‌తంగా నాయ‌కుల మ‌న‌సులో ఎలా ఉన్నా పార్టీల ప‌రంగా మాత్రం హ్యాపీగానే ఉన్నారు. పైగా.. జ‌న‌సేన నాయ‌కుడు, ప‌ర్యాట‌క మంత్రి కందుల దుర్గేష్‌కు ఫ‌స్ట్ ర్యాంకు రావ‌డంతో ఆ పార్టీ వ‌ర్గాలు హ్యాపీగానే ఫీల‌వుతున్నాయి. ఒకే ఒక్క మంత్రి ఉన్న బీజేపీ కూడా.. పెద‌వి విరిచేందుకు అవ‌కాశం లేదు. స‌త్య‌కుమార్ యాద‌వ్ ప‌నితీరుకు త‌గిన ర్యాంకే వ‌చ్చింద‌న్న అభిప్రాయం ఆ పార్టీ వ‌ర్గాల్లోనూ క‌నిపిస్తోంది. మొత్తంగా అనేక కూర్పులు, చేర్పులు అయితే.. ఈ ర్యాంకుల్లో స్ప‌ష్టంగా క‌నిపించ‌డం గ‌మ‌నార్హం.