వర్మ నోట ఆ పదాలే వినిపించలేదట

నిత్యం వివాదాలతో సావాసం చేస్తున్న సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనను తాను ఓ దర్శకుడిగానే నిరూపించుకున్నాడు. వైసీపీతో ఎంతగా అంటకాగుతున్నా కూడా తానూ ఓ సినిమా మనిషినేనని.. రాజకీయాల్లో ఆరితేరిన నేతను అయితే కాదని ఆయన తేల్చి చెప్పారు. సోషల్ మీడియా అసభ్య పోస్టుల వ్యవహారాల్లో శుక్రవారం ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరైన సందర్బంగా ఆయన దాదాపుగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పోలీసులు అడిగిన ప్రశ్నల్లో 90 శాతం ప్రశ్నలకు వర్మ సమాధానాలు ఇచ్చారట.

హై ప్రొఫైల్ వ్యక్తులు సాధారణంగా విచారణలో పోలీసులకు పెద్దగా సహకరించరు. అదే సదరు హై ప్రొఫైల్ వ్యక్తులు రాజకీయ నేతలు అయితే… పోలీసులు తలలు పట్టుకోవాల్సిందే. విచారణకు హాజరయ్యే ముందు వైసీపీకి చెందిన చాలా మంది నేతలు ఆయనకు ధైర్యం చెప్పి మరీ పంపించారు. అయినా కూడా వర్మ తన తెలివితేటలను పోలీసుల వద్ద ప్రదర్శించలేదు. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆయన ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. ఈ సందర్బంగా చాలా మంది నేతలు చెప్పే ‘తెలియదు, గుర్తు లేదు, మరిచిపోయాను’ వంటి సమాధానాలు అస్సలే వినిపించలేదట.

అంతేకాదండోయి… చంద్రబాబు, లోకేష్, పవన్ లఫై అసభ్య పోస్టులు పెట్టింది తానేనని కూడా వర్మ ఒప్పుకున్నారట. తానూ తీసిన సినిమా ప్రమోషన్ లో భాగంగానే సదరు పోస్టులు పెట్టినట్టుగా వర్మ ఒప్పుకున్నారట. ఈ విషయంలో వైసీపీ నేతల ప్రమేయం ఏమీ లేదని కూడా ఆయన చెప్పారట. అయినా ఒకరు చెబితే తానూ వైన్ మనిషినేనా అన్నట్టుగా వర్మ సమాధానం ఇచ్చారట. ఇక వైసీపీ నేతలతో తనకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయని… ఆ కారణంగానే వారు తనను ఒంగోలు లో కలిశారని వర్మ చెప్పారట.